ఆ ఇద్దరిదీ ఆధికారం కోసం ఆరాటం, పేదలను పట్టించుకోరు: రాహుల్
ABN , Publish Date - Apr 25 , 2026 | 09:36 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ పేదలను పట్టించుకోరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ సంపదను ధనికులకు దోచుపెడుతున్నారంటూ విమర్శించారు.
హుగ్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ పేదలను పట్టించుకోరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశ సంపదను ధనికులకు దోచుపెడుతున్నారంటూ విమర్శించారు. హుగ్లీ జిల్లాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, మోదీ దేశభక్తుడనని చెప్పుకుంటూ దేశాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని ఎక్కడకు వెళ్లినా విద్వేషం, భయాన్ని వ్యాపింపజేస్తారని, ఇప్పుడు దేశంలో జరుగుతున్నది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం పాటుపడుతూ, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల విద్వేషం, హింసకు వ్యతిరేకంగా పోరాడుతోందని చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తనపై అనేక కేసులు పెట్టిందని, మమతా బెనర్జీపై ఎలాంటి కేసు పెట్టలేదని రాహుల్ అన్నారు. బీజేపీతో మమతాబెనర్జీ నేరుగా పోరాడకపోవడమే అందుకు కారణమని చెప్పారు. తనను వరుసగా 5 రోజుల పాటు ఈడీ ప్రశ్నించిందని, మమతా బెనర్జీపై మాత్రం ఈడీ, సీబీఐ దర్యాప్తులు లేవని అన్నారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే బీజేపీపై సైద్ధాంతిక పోరాటం చేస్తోందని, ఆ కారణంగానే తనపైన, పార్టీ అధ్యక్షుడు ఖర్గేపైన 24 గంటలూ మోదీ దాడులు చేస్తుంటారని విమర్శించారు.
ఎన్నికలప్పుడే..
ఎన్నికలు వచ్చినప్పుడే టీఎంసీపై ప్రధానమంత్రి విమర్శలు చేస్తుంటారని, బెంగాల్ ఎన్నికలు పూర్తయితే మమతాబెనర్జీని మోదీ ఒక్కమాట కూడా అనిరని రాహుల్ చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ను ఓడించగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని, ఆ విషయం మోదీకి తెలుసుని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో పరిశ్రమల నాశనానికి, యువత నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి టీఎంసీ సుప్రీం కారణమని విమర్శంచారు. పార్టీ కార్యకర్తలు, గూండాల ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తుంటారని, టీఎంసీ హయాంలో కోట్లాది రూపాయల శారద స్కామ్, రోజ్ వ్యాలీ పాంజీ స్కామ్‌లు చోటుచేసుకున్నాయని చెప్పారు. బెంగాల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలపై టీఎంసీ అకృత్యాలు జరుపుతుంటే, దేశంలోని ఇతర ప్రాంతాల కాంగ్రెస్ కార్యకర్తలపె బీజేపీ అకృత్యాలు చేస్తోందన్నారు. మమతాబెనర్జీ వల్లే బెంగాల్‌లో బీజేపీ అడుగుపెట్టిందని, ప్రజల కోసం టీఎంసీ పనిచేసి ఉంటే బీజేపీ రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశమే ఉండేది కాదన్నారు.
ఇవి కూడా చదవండి..
అమిత్‌షాపై లీగల్ కేసు వేస్తా: మమతా బెనర్జీ
గూండాలకు జైలు లేకుంటే పైకి ... రాజ్‌నాథ్ హెచ్చరిక