మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురి మృతి
ABN , Publish Date - Jun 14 , 2026 | 07:43 PM
మధ్యప్రదేశ్‌లోని హేతమ్‌పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లోని హేతమ్‌పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈరోజు (ఆదివారం) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వేపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలు ఏం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖజురహో–ఉదయ్‌పూర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగినట్లు మొదట ప్రచారం జరిగింది. దీంతో భయాందోళనకు గురైన కొందరు ప్రయాణికులు అత్యవసరంగా చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. రైలు నిలిచిన తర్వాత పలువురు ప్రయాణికులు హడావుడిగా బోగీల నుంచి దిగి పక్కనున్న పట్టాలపైకి వెళ్లారు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వేగంగా వస్తున్న పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన జరిగింది.
ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం రైల్వేట్రాక్‌పై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉదయ్‌పూర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో నిజంగా మంటలు చెలరేగాయా లేదా అనే అంశంపై కూడా రైల్వేశాఖ విచారణ చేపట్టింది. ఈ దుర్ఘటనతో హేతమ్‌పుర్ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News