బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:48 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటీవల బీజీపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు కేంద్ర హోం శాఖ 'ఎక్స్' కేటగిరీ భద్రత కల్పించింది. ఇందులో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందిని ఆయన భద్రత కోసం కేటాయించింది.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటీవల బీజీపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్(Leander Paes)కు కేంద్ర హోం శాఖ 'ఎక్స్' కేటగిరీ భద్రత కల్పించింది. ఇందులో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందిని ఆయన భద్రత కోసం కేటాయించింది. పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు లియాండర్ పేస్ సిద్ధపడుతుండటంతో కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
టీఎంసీ నుంచి బీజేపీకి..
యాభై రెండేళ్ల లియాండర్ పేస్ గత వారం బీజేపీలో చేరారు. తాను లాంఛనపూర్వకంగా పార్టీలో చేరలేదని, ఒక బాధ్యతతో, దేశానికి సేవచేసే లక్ష్యంతో బీజేపీలో చేరినట్టు చెప్పారు. బీజేపీలో చేరడానికి ముందు మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు.
స్టార్ క్యాంపెయినర్‌గా..
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సాగించే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో లియాండర్ పేస్‌ను కూడా బీజేపీ చేర్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, మిథున్ చక్రవర్తి, కంగానా రనౌత్ తదితరులు కూడా పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారంలో ఉన్నారు. కాగా, బెంగాల్‌కు రెండు దఫాలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ అసెంబ్లీ కాంప్లెక్స్‌లోకి దూసుకెళ్లిన వాహనం.. డ్రైవర్ అరెస్టు
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్