మతం అడిగి చంపేశారు
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:03 AM
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా కేలం ప్రాంతంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులను శుక్రవారం రాత్రి కాల్చిచంపారు. హత్యకు ముందు ఉగ్రవాదులు మృతుల కులం, మతం గురించి అడిగినట్లు బాధితుల బంధువులు తెలిపారు.
కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
కుల్గాం జిల్లాలో ఇద్దరు ఛతీస్‌గఢ్ వలస కార్మికుల హత్య..
ముందుగా మతంపై ఆరా
జమ్ము: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా కేలం ప్రాంతంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులను శుక్రవారం రాత్రి కాల్చిచంపారు. హత్యకు ముందు ఉగ్రవాదులు మృతుల కులం, మతం గురించి అడిగినట్లు బాధితుల బంధువులు తెలిపారు. మృతుల్లో ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాకు చెందిన దీపక్ రాత్రే (24), సారంగఢ్-బిలాయ్‌గఢ్ జిల్లాకు చెందిన భూపేంద్ర భైనా (28) ఉన్నారు. దీపక్ ఘటనాస్థలంలోనే చనిపోగా, భూపేంద్ర సౌరాలోని స్కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
ఉపాధిని వెతుక్కుంటూ దీపక్ 8 నెలల క్రితం జమ్ముకశ్మీర్‌కు వెళ్లగా, భూపేంద్ర మూడు నెలల క్రితమే వెళ్లాడు. 2025, ఏప్రిల్ 22న పహల్గాంలోనూ 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఇలాగే మతం అడిగి కాల్చిచంపారు. ఉగ్రదాడుల ఘటనల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం ఉన్నతాధికారులతో సమావేశమై శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు.
కాగా, అమాయక కూలీలను ఉగ్రవాదులు దారుణంగా హత్యచేయటాన్ని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు జమ్ముకశ్మీర్ తరఫున రూ.10లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఒమర్ అబ్దుల్లా శనివారం తెలిపారు. ఛత్తీస్‌గఢ్ సీఎం కూడా బాధిత కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా కుల్గాం జిల్లా యంత్రాంగం రూ.6లక్షల చొప్పున అందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బెంగాల్ ఉగ్ర మోడ్యూల్ గుట్టురట్టు.. జంతర్ మంతర్ ధర్నాలో దాడికి ఉగ్రవాది కుట్ర!
For More National News And Telugu News