మనం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి.. అభిమానులకు ధనుష్ పిలుపు!
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:58 AM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే ఊహాగానాలు తమిళనాడులో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇటీవల చెన్నైలో తన అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి హాజరైన ధనుష్.. అక్కడ అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇళయ దళపతి విజయ్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఏకంగా ముఖ్యమంత్రి కావడంతో మరికొందరు హీరోలు అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా రాఘవ లారెన్స్, ధనుష్ వంటి స్టార్లు రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ధనుష్ తన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి ఊహాగానాలకు తెరలేపాడు. తమ ఐక్యతను కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రజా సేవ కోసం ఉపయోగించాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో, ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది.
చెన్నైలో అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో ధనుష్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'ఇంతమంది ఒకేచోట చేరారు. ఈ ఐక్యతలో గొప్ప శక్తి ఉంది. దానికి ఓ విలువను చేకూర్చాలి. మనం కేవలం ఆడియో వేడుకలు, అభిమానులతో సమావేశాలకే పరిమితం కాకుండా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. మీ ప్రాంతంలోని ప్రజలకు, మీ ఇంటి చుట్టుపక్కల నివసించే కుటుంబాల అవసరాలను అర్ధం చేసుకోండి. అంతేకాక వారికి మీకు తోచిన సాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను మరింత గర్వపడాలి. మీరు ఇది చేస్తారని నేను నమ్ముతున్నాను' అని తెలిపాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విజయ్ తర్వాత ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 'తమిళనాడుకు ధనుష్ లాంటి నిజాయితీపరులు, ధైర్యవంతులైన నాయకులు అవసరం' అని ఒకరంటే, 'త్వరలోనే ధనుష్ నుంచి కొత్త పార్టీ ప్రకటన ఆశించవచ్చు' అని మరొకరు అభిప్రాయపడ్డారు. మరోవైపు, తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే నటుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నందున ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి ప్రభావం చూపుతారనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్, భవిష్యత్తులో నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారో లేదో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
పాక్‌పై సాధించిన నా విజయం కార్గిల్ వీరులకు అంకితం: జాదుమణి
వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్