Share News

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం, వజ్రాల ఆభరణాలు అదృశ్యం..

ABN , Publish Date - May 27 , 2026 | 01:54 PM

కేరళ తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం, వజ్రాల ఆభరణాలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేరళ డీజీపీ వెల్లడించడంతో ఆలయ భద్రతపై భక్తుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం, వజ్రాల ఆభరణాలు అదృశ్యం..
Sree Padmanabhaswamy Temple

కేరళ: తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం, వజ్రాల ఆభరణాలు అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేరళ డీజీపీ వెల్లడించడంతో ఆలయ భద్రతపై భక్తుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్వామివారి ఆభరణాలు కనిపించకుండా పోయాయని కేరళ హోం శాఖ సెక్రటరీకి డీజీపీ సమర్పించిన నివేదిక చర్చనీయాంశమైంది.


డీజీపీ నివేదిక ప్రకారం.. ఆలయం నుంచి సుమారు 78 గ్రాముల బంగారు, వజ్రాల ఆభరణాలు అదృశ్యమయ్యాయి. వాటిలో వైరమ్ నామంగా పిలువబడే వజ్రాల ఆభరణం కూడా ఉంది. అధికారిక రికార్డుల ప్రకారం వైరమ్ నామాన్ని మరమ్మతుల కోసం కొన్ని నెలల కిందట ఆలయం నుంచి బయటకు తీసుకెళ్లారు. కానీ, ఆ తర్వాత దానిని తిరిగి తీసుకురాలేదు. అదే విధంగా ఆరు నెలల కిందట ఆలయం నుంచి తీసుకెళ్లిన బంగారు దీపం కూడా కనిపించకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టి భద్రతను పటిష్ఠం చేయాలని హోం శాఖ సెక్రటరీని కోరారు.


ఈ సందర్భంగా స్వామివారి విలువైన ఆభరణాల నిర్వహణపై డీజీపీ పలు కీలక సూచనలు చేశారు. అన్ని బంగారు, వెండి వస్తువులను సురక్షిత ఖజానాలకు తరలించాలని నివేదికలో పేర్కొన్నారు. సరైన తనిఖీ లేకుండా ఏ వ్యక్తినీ లోపలికి అనుమతించకుండా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల కానుకలను ప్రత్యేక లాకర్లలో భద్రపరచాలనీ సూచించారు. మరోవైపు స్వామివారి ఆభరణాలు అదృశ్యం కావడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ పద్మనాభ స్వామివారి శతాబ్దాల నాటి సంపద నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉగాండా మహిళకు ఎబోలా లక్షణాలు.. బెంగళూరులో ఐసోలేట్..

ఎస్ఐఆర్ ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్

Updated Date - May 27 , 2026 | 01:54 PM