నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ..
ABN , Publish Date - May 27 , 2026 | 01:02 PM
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు డాక్టర్ మనోజ్ శిరూరే కాగా.. మరొకరు ప్రముఖ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ తేజస్ హర్షద్ కుమార్ షాగా గుర్తించారు.
ఢిల్లీ: నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు డాక్టర్ మనోజ్ శిరూరే కాగా.. మరొకరు ప్రముఖ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ తేజస్ హర్షద్ కుమార్ షాగా గుర్తించారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 13కి చేరింది.
లాతూర్‌లో వైద్యుడిగా మనోజ్ శిరూరే పని చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఓ కోచింగ్ సెంటర్ యజమాని కుమారుడితో సహా ముగ్గురు విద్యార్థులకు అతను కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు లీక్ చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపించారు. ప్రశ్నపత్రాలను మరో నిందితుడైన పి.వి.కులకర్ణి నుంచి శిరూరే పొందినట్లు తెలిపారు. మరో నిందితుడు తేజస్ హర్షద్ కుమార్ షా.. పూణేలోని ప్రముఖ కోచింగ్ సంస్థ డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ(APMA)లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న మనీషా హవల్దార్ నుంచి ఆయన ఫిజిక్స్ ప్రశ్నపత్రాలను పొందినట్లు ఆరోపించారు. వీరిద్దరి పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని సీబీఐ అధికారులు తెలిపారు.
కాగా, నీట్ పేపర్ లీక్ ఘటనపై సీబీఐ 2026 మే 12న కేసు నమోదు చేసింది. అనంతరం దేశవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్ సహా 49 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 13 మందిని అరెస్టు చేసి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు సహా అనేక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఉగాండా మహిళకు ఎబోలా లక్షణాలు.. బెంగళూరులో ఐసోలేట్..
ఎస్ఐఆర్ ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్