Share News

ఉగాండా మహిళకు ఎబోలా లక్షణాలు.. బెంగళూరులో ఐసోలేట్..

ABN , Publish Date - May 27 , 2026 | 10:34 AM

ఈనెల 23న ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ మహిళ చేరుకున్నారు. ఒళ్లునొప్పులు, అలసట వంటి ఎబోలా లక్షణాలను ఆమెలో ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తించారు.

ఉగాండా మహిళకు ఎబోలా లక్షణాలు.. బెంగళూరులో ఐసోలేట్..
Uganda Woman Ebola Symptoms

బెంగళూరు: నగరంలో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా వ్యాధి లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. ఉగాండాలో ఇటీవల ఎబోలా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే వారిని భారత విమానయాన శాఖ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే, మే 23న ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ మహిళ చేరుకున్నారు.


ఈ సందర్భంగా సదరు మహిళలో ఒళ్లునొప్పులు, అలసట వంటి లక్షణాలను ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆమెను బెంగళూరు ఇందిరానగర్‌లోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రికి తరలించి ఐసోలేట్ చేశారు. మహిళకు ఇప్పటివరకు ఎబోలా వ్యాధి నిర్ధారణ కానప్పటికీ ఆస్పత్రి సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎబోలా నిర్ధారించేందుకు పరీక్ష నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి తరలించారు. కాగా, మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.


మరోవైపు భారతదేశంలో ఎబోలా వైరస్ వ్యాధి కేసులు నమోదు కాలేదని, ప్రయాణికురాలి పరిస్థితి నిలకడగానే ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 'ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల ఎబోలా వైరస్ వ్యాప్తి చెందిన దృష్ట్యా భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది' ఓ ప్రకటనలో పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి

బైజూస్‌ వ్యవస్థాపకుడికి ఆరు నెలల జైలు.. సింగపూర్ కోర్టు తీర్పు..

కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు..

Updated Date - May 27 , 2026 | 10:37 AM