ఏడేళ్ల తర్వాత బతికొచ్చిన మహిళ.. రెండేళ్లకు పైగా జైల్లో అమాయకుడు
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:45 PM
హత్యకు గురైందనుకున్న ఓ మహిళ ఏడేళ్ల తర్వాత సజీవంగా కనిపించింది. ఆమె హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఓ అమాయకుడిని పోలీసులు అరెస్టు చేయగా.. అతడు రెండేళ్లకు పైగా జైల్లో గడపాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: హత్యకు గురైందనుకున్న ఓ మహిళ ఏడేళ్ల తర్వాత సజీవంగా కనిపించింది. ఆమె హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఓ అమాయకుడిని పోలీసులు అరెస్టు చేయగా.. అతడు రెండేళ్లకు పైగా జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండ్య జిల్లాలోని పాండవపుర ప్రాంతానికి చెందిన మంజుకు ఇష్టంలేని వివాహం చేశారు. దీంతో ఆమె.. తన తండ్రి ఇంటి నుంచి 2019 జులై 3న వెళ్లిపోయింది. ఆరోజు బస్టాండ్ వద్ద రాజేష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని తండ్రికి కాల్ చేసింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు వెళ్లిపోతున్నానని చెప్పింది. అయితే మంజు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు దర్యాప్తు చేయగా.. మంజు చివరిసారిగా ఫోన్ మాట్లాడిన నంబర్ రాజేష్‌కు చెందినట్లు గుర్తించారు. అయితే ఆమె ఆచూకీ లభించకపోవడంతో 2021లో ఈ కేసును గుర్తుతెలియని కేసుగా మూసివేశారు. ఇదిలా ఉండగా.. అదే ఏడాది ఆగస్టు 11న నాగరాజు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2019లో మంజును రాజష్ కిడ్నాప్ చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కావేరి నదిలో పడేశాడని ఫిర్యాదులో ఆరోపించాడు. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి, ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ (ప్రస్తుతం పదవీ విరమణ పొందారు) రాజేష్‌ను అరెస్టు చేశారు. పశ్చిమవాహిని ప్రాంతంలో ఘటనా స్థల పరిశీలన నివేదికను రూపొందించి, సాక్షుల వాంగ్మూలాలు తీసుకుని చార్జిషీటు దాఖలు చేశారు. అయితే ఈ కేసులో మంజు మృతదేహం దొరకలేదు. అయినప్పటికీ రాజేష్ రెండున్నరేళ్లపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అనంతరం రాజేష్ తన తండ్రి, న్యాయవాది సహకారంతో బెయిల్‌పై బయటకు వచ్చాడు.
న్యాయవాదితో వెలుగులోకి నిజం
బయటకు వచ్చిన తర్వాత కూడా రాజేష్ తాను అమాయకుడిననే చెప్పాడు. అతడి తరఫు న్యాయవాదులు స్వతంత్రంగా విచారణ చేపట్టి మంజు ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు మండ్య జిల్లాలోని నాగమంగళ ప్రాంతంలో మంజు తన భర్తతో కలిసి నివసిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని రాజేష్ న్యాయవాది పోలీసులకు తెలిపారు. దీంతో బిందిగనవిళె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, మంజును ఒక షెల్టర్ హోంకు తరలించారు. మంజును విచారించగా రాజేష్ ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది. తన అదృశ్యం తర్వాత ఆయనపై హత్య కేసు నమోదైన విషయం కూడా తెలియదని వెల్లడించింది. రాజేష్ నిర్దోషి అని, ఎక్కడైనా ఈ విషయం వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది.
దర్యాప్తు అధికారిపై విచారణకు ఆదేశం
తప్పుడు ఫిర్యాదు చేసి రాజేష్‌ను ఇబ్బందులకు గురిచేసిన నాగరాజుతోపాటు, తప్పుడు ఆధారాలు సృష్టించి అతని జీవితాన్ని నాశనం చేసిన అప్పటి దర్యాప్తు అధికారి ప్రభాకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మండ్య ఎస్పీ శోభారాణి స్పందించారు. మృతదేహం లభించకుండానే చార్జిషీట్ ఎలా దాఖలు చేశారనే అంశంపై తక్షణమే వ్యాఖ్యానించలేనని తెలిపారు. ఈ కేసులో జరిగిన తప్పిదాలపై సమగ్ర విచారణ చేపట్టి, పూర్తి నివేదిక సమర్పించాలని డీఎస్పీని ఆదేశించానని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్
ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..