Share News

కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం మే 30..! ఈసారి ముగ్గురు డిప్యూటీ సీఎంలు

ABN , Publish Date - May 27 , 2026 | 02:34 PM

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. మే 30వ తేదీ శనివారంనాడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల తాజా సమాచారం. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది.

కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం మే 30..! ఈసారి ముగ్గురు డిప్యూటీ సీఎంలు
Siddaramaiah and DK Shivakumar

న్యూఢిల్లీ: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. మే 30వ తేదీ శనివారంనాడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల తాజా సమాచారం. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది. వీరిలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఒకరు, ఓబీసీ వర్గానికి చెందిన మరొకరితో పాటు ఒక మహిళ ఉంటారు.


కర్ణాటకలో నాయకత్వ మార్పునకు మార్గం సుగమం చేయాలని, జాతీయ స్థాయిలో కీలకమైన సంస్థాగత బాధ్యత చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పార్టీ అధిష్ఠానం కోరినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ నుంచి నేరుగా ఈ సందేశం రావడంతో సిద్ధరామయ్య సైతం పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.


గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కోరిన సిద్ధరామయ్య

తాజా సమాచారం ప్రకారం, ఈనెల 28న అపాయింట్‌మెంట్ ఇవ్వాలని గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌ను సిద్ధరామయ్య కోరారు. అదేరోజు తన రాజీనామా పత్రాన్ని అందజేసి, తన డిప్యూటీ డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తారు. 'గురువారంనాడు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని గవర్నర్‌ను ముఖ్యమంత్రి కోరిన మాట నిజమే' అని సిద్ధరామయ్య సన్నిహితుడు ఒకరు తెలిపారు.


మంత్రివర్గంతో బ్రేక్‌ఫాస్ట్ మీట్

సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో తన క్యాబినెట్ మంత్రులతో కీలకమైన బ్రేక్‌ఫాస్ట్ మీట్‌ను ఆయన గురువారం ఉదయం ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. కాగా, ఢిల్లీలో ఉన్న డీకే శివకుమార్ బుధవారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకుని తిరిగి గురువారం హస్తినకు వెళ్తారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరిగే బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం, వజ్రాల ఆభరణాలు అదృశ్యం..

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

Updated Date - May 27 , 2026 | 02:45 PM