Share News

సోనియాగాంధీపై వ్యాఖ్యలు.. కంగనా రనౌత్‌పై ఎఫ్‌ఐఆర్

ABN , Publish Date - Nov 14 , 2026 | 09:58 AM

ప్రముఖ బాలివుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై భారతీయ న్యాయ సంహితలోని 196(1)(బీ), 353(2), 356(2) సెక్షన్ల కింద హిమాచల్ ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

సోనియాగాంధీపై వ్యాఖ్యలు.. కంగనా రనౌత్‌పై ఎఫ్‌ఐఆర్

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలివుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై హిమాచల్ ప్రదేశ్‌లో కేసు నమోదైంది. ఆమె సోషల్ మీడియాలో సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ షిమ్లాకు చెందిన అతుల్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కంగనపై ‘హిమాచల్’ పోలీసులు నిన్న (శుక్రవారం) ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 196(1)(బీ), 353(2), 356(2) సెక్షన్లను నమోదు చేశారు. ఈ విషయాన్ని షిమ్లా ఎస్పీ (Superintendent of Police) గౌరవ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు.


కాగా సోనియాపై, రాజీవ్, సంజయ్ గాంధీల మరణాలపై కంగనా రనౌత్ నవంబర్ 10న సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అతుల్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె పోస్టులు మత సామరస్యాన్ని దెబ్బతీయగలవని, ప్రజాశాంతికి విఘాతం కలిగించగలవని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. సోనియాగాంధీని అనుమానాస్పద విదేశి శక్తిగా చిత్రీకరించాలని కంగన ప్రయత్నించారని తెలిపారు. ఇందిరా గాంధీ మరణంపైనా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అనవసర ఆందోళనలను సృష్టించే విధంగా కంగన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని అతుల్ శర్మ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించామని గౌరవ్ సింగ్ వివరించారు.


ఈ వార్తలూ చదవండి

మోదీ ఫిలిప్పీన్స్ టూర్ ఖరారు.. రెండు కీలక సదస్సులకు హాజరుకానున్న ప్రధాని

కేరళంలో షాకింగ్ ఘటన.. ప్రియుడిని హత్య చేసేందుకు ప్రియురాలి యత్నం..

Updated Date - Nov 14 , 2026 | 10:11 AM