కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:50 PM
జార్ఖాండ్‌లోని 'ఇండియా' కూటమిలో తాజాగా విభేదాలు పొడచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్ఖాండ్ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నికల జరగాల్సి ఉండగా, రాష్ట్రంలో జేఎంఎం భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఒక సీటును ఆశిస్తోంది.
రాంచీ: జార్ఖాండ్‌లోని 'ఇండియా' కూటమిలో తాజాగా విభేదాలు పొడచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్ఖాండ్ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నికల జరగాల్సి ఉండగా, రాష్ట్రంలో జేఎంఎం భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఒక సీటును ఆశిస్తోంది. పార్టీ నుంచి పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థి పేరును ఇప్పటికే ప్రకటించింది. అయితే రెండు రాజ్యసభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు జేఎంఎం తాజాగా నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జేఎంఎం శాససనభ్యలు, మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు శుక్రవారంనాడు సమావేశమయ్యారు. ఖాళీగా ఉన్న రెండు సీట్లలోనూ జేఎంఎం పోటీ చేయాలని సమావేశంలో ఏకాభిప్రాయం కుదరినట్టు సమావేశానంతరం రాష్ట్ర మంత్రి యోగేంద్ర మెహతో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కే అప్పగించినట్టు వివరించారు. ఈ క్రమంలో రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాగస్వామ్య పార్టీలతో సోరెన్ సంప్రదింపులు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జార్ఖాండ్ నుంచి పోటీ చేసే అభ్యర్థితో పాటు ఏడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. భాగస్వామ్య పక్షంగా తమకు ఒక సీటును జేఎంఎం కేటాయిస్తుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది. రెండు సీట్లూ తమకే కావాలని జేఎంఎం పట్టుపడితే దీనిపై రాబోయే రోజుల్లో ఇరుపార్టీల మధ్య ముమ్మరంగా సంప్రదింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు
వివిధ రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరుగనున్నాయి. జార్ఖాండ్‌లో చాలాకాలంగా జేఎంఎం, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి. సోరెన్ నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కూడా ఉంది. రెండు రాజ్యసభ సీట్లు ఆశించడం ద్వారా జార్ఖాండ్ రాకీయాల్లో తమ బలం చెక్కుచెదరకూడదని జేఎఎం భావిస్తుండగా, కూటమి ప్రభుత్వంలో తాము రాజకీయ ప్రాధాన్యం కోల్పోరాదని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.
ఇవి కూడా చదవండి..
లోక్‌సభకు మమతా బెనర్జీ .. బహరాంపుర్ నుంచి పోటీకి యోచన
హిమంత మంత్రివర్గ విస్తరణ.. 12 మందికి చోటు