Share News

జేఎంఎం, కాంగ్రెస్ మధ్య సయోధ్య.. చెరో రాజ్యసభ సీటుకు పోటీ

ABN , Publish Date - Jun 07 , 2026 | 07:07 PM

జార్ఖాండ్‌ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ విషయంలో జేఎంఎం, కాంగ్రెస్ మధ్య ఏర్పడిన విభేదాలకు తెరపడింది. చెరో స్థానంలో పోటీ చేసేందుకు రెండు భాగస్వామ్య పార్టీల మధ్య సయోధ్య కుదిరింది.

జేఎంఎం, కాంగ్రెస్ మధ్య సయోధ్య.. చెరో రాజ్యసభ సీటుకు పోటీ
Rahul Gandhi with Hemant Soren

రాంచీ: జార్ఖాండ్‌ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ విషయంలో జేఎంఎం, కాంగ్రెస్ మధ్య ఏర్పడిన విభేదాలకు ఎట్టకేలకు తెరపడింది. చెరో స్థానంలో పోటీ చేసేందుకు రెండు భాగస్వామ్య పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో కాంగ్రెస్ పరిశీలకులు భూపేశ్ బఘేల్, అజయ్ శర్మ ఆదివారంనాడు జరిపిన చర్చల అనంతరం ఇరుపార్టీల మధ్య అవగాహన కుదిరింది. కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు హేమంత్ సోరెన్ అంగీకారం తెలిపారు.


రెండ్రోజులుగా ఉత్కంఠ

రాజ్యసభ సీట్లకు పోటీపై గత రెండ్రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. జేఎంఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గత శుక్రవారంనాడు సమావేశమై రెండు రాజ్యసభ స్థానాలకు జేఎంఎం పోటీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే తుది నిర్ణయం ముఖ్యమంత్రికే అప్పగించినట్టు తెలిపారు. జేఎంఎం నిర్ణయంతో అప్పటికే జార్ఖాండ్‌ నుంచి తమ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. ఆ పార్టీ పరిశీలకులు భూపేష్ బఘేల్, అజయ్ శర్మ హుటాహుటిన హేమంత్ సోరెన్‌తో శనివారంనాడు సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం మరో విడత చర్చల అనంతరం చెరో సీటు పంచుకునేందుకు అవగాహన కుదిరింది.


బలాబలాలు

జార్ఖాండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులు ఉండగా, హేమంత్ సోరెన్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి 56 మంది సభ్యుల మద్దతు ఉంది. జేఎంఎంకు 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు16, ఆర్జేడీకి 4, వామపక్షాలకు ఇద్దరు సభ్యుల బలం ఉంది. ఒక్కో రాజ్యసభ సీటు గెలిచేందుకు 28 మంది సభ్యుల బలం అవసరం కాగా జేఎంఎం తేలిగ్గా ఒక సీటును గెలుచుకోగలుగుతుంది. రెండో సీటును భాగస్వామ్య పార్టీలతో కలిపి కాంగ్రెస్ గెలుచుకునే వీలుంది. మరోవైపు, విపక్ష ఎన్డీయే కూటమికి 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 21 మంది సభ్యుల బలం ఉండగా, ఏజేఎస్‌యూ, జేడీయూ, ఎల్‌జేపీకి ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. మరో ఓటు ఇండిపెండెట్ ఎమ్మెల్యే జైరామ్ మహతో చేతిలో ఉంది. 'ఇండియా' కూటమిలో ఎలాంటి చీలిక వచ్చినా రెండో సీటును ఎన్డీయే ఎగరేసుకుపోయే అవకాశాలు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో తమ పార్టీ నుంచి ఒకే అభ్యర్థిని పోటీలోకి దింపుతూ కూటమి ఐక్యతకు జేఎంఎం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

'ఇండియా' కూటమి కీలక సమావేశం.. ఢిల్లీకి బయలుదేరిన మమత

సీఎం పదవి చేపట్టాక తొలిసారి మెట్రో రైలులో ప్రయాణించిన డీకే

Updated Date - Jun 07 , 2026 | 07:10 PM