Share News

'ఇండియా' కూటమి కీలక సమావేశం.. ఢిల్లీకి బయలుదేరిన మమత

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:25 PM

ఈనెల 8న జరుగనున్న 'ఇండియా' కూటమి సమావేశంలో పాల్గొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆదివారంనాడు ఢిల్లీ బయలుదేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇండియా కూటమి తొలిసారి సమవేశమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

'ఇండియా' కూటమి కీలక సమావేశం.. ఢిల్లీకి బయలుదేరిన మమత
Mamata Banerjee

న్యూఢిల్లీ: ఈనెల 8న జరుగనున్న 'ఇండియా' కూటమి సమావేశంలో పాల్గొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ (Mamata Banerjee) ఆదివారంనాడు ఢిల్లీ బయలుదేరారు. పార్టీ సీనియర్ నేతలు డోలా సేన్, కల్యాణ్ బెనర్జీలు కోల్‌కతా విమానాశ్రయానికి మమత వెంట వచ్చారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత 'ఇండియా' కూటమి తొలిసారి సమవేశమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు తీవ్రమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నాయి. పలు రాష్ట్రాల్లో కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు సైతం తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరుగనున్న సమావేశంలో విపక్ష కూటమి భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 23 పార్టీలు ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ధ్రువీకరించింది.


పశ్చిమబెంగాల్‌లో సుదీర్ఘంగా పాలన సాగించిన టీఎంసీని బీజేపీ ఇటీవల గద్దెదింపి అధికారంలోకి వచ్చింది. అనంతరం టీఎంసీలో అంతర్గత విభేదాలు పొడచూపడటం, పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు చేయడం వంటివి ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో టీఎంసీకి, మమతాబెనర్జీకి 'ఇండియా' కూటమి సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్, ఆ పార్టీ భాగస్వాముల మధ్య సంబంధాల్లో కూడా పలు రాష్ట్రాల్లో విభేదాలు తలెత్తాయి. తమిళనాడు ఎన్నికల్లో తమ భాగస్వామిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అనంతరం టీవీకేకు మద్దతు ప్రకటించి ప్రభుత్వంలో చేరడం డీఎంకేకు మింగుడు పడటం లేదు. ఈ పరిణామంపై బాహాటంగానే ఆ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో జరుగనున్న ఇండియా కూటమికి దూరంగా ఉండాలని డీఎంకే నిర్ణయం తీసుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఇండియా కూటమి సమావేశానికి రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను పంపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా వాహనంపై కోడిగుడ్లతో దాడి

సీఎం పదవి చేపట్టాక తొలిసారి మెట్రో రైలులో ప్రయాణించిన డీకే

Updated Date - Jun 07 , 2026 | 05:28 PM