Share News

సీఎం పదవి చేపట్టాక తొలిసారి మెట్రో రైలులో ప్రయాణించిన డీకే

ABN , Publish Date - Jun 07 , 2026 | 04:35 PM

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారంనాడు మెట్రో రైలులో ప్రయాణించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేప్టటిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గమైన కనకపురలో పర్యటనకు బయలుదేరారు.

సీఎం పదవి చేపట్టాక తొలిసారి మెట్రో రైలులో ప్రయాణించిన డీకే
DK Shivakumar

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆదివారంనాడు మెట్రో రైలులో ప్రయాణించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేప్టటిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గమైన కనకపురలో పర్యటనకు ఆయన బయలుదేరారు. ఇందుకోసం ఆయన విధాన సౌధ స్టేషన్ నుంచి కనకపుర రోడ్- సిల్క్ ఇన్‌స్టిట్యూట్ వరకూ మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు.


'సామాన్యులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకూడదనే నా ఉద్దేశం. సీఎం ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా పలు ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. అందుకే 45 నుంచి 50 నిమిషాలు మెట్రోలో ప్రయాణించాలనుకున్నాను. 1985 నుంచి నాకు ఓటు వేసి గెలిపిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు మా గ్రామానికి వెళ్తున్నాను' అని డీకే చెప్పారు. అనంతరం కనకపుర స్టేషన్ నుంచి రోడ్డుమార్గంలో ఆయన వెళ్లారు.


ఇటీవల బెంగళూరు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై అరగంట సేపు గవర్నర్ ప్రయాణానికి సంబంధించి ట్రాఫిక్ నిలిపివేయడంతో ఒక వ్యక్తి బైఠాయింపు నిరసనకు దిగారు. గర్భిణి అయిన తన భార్య అరగంట సేపు వేచిచూడాల్సి రావడంపై ఆందోళన తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీఐపీ సంస్కృతిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై విచారణ జరిపామని, అయితే అప్పుడు నిరసనకు దిగిన వ్యక్తి ఒంటరిగానే ఉన్నాడని తేలిందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వివరణ ఇచ్చారు. అంబులెన్స్‌లు, మెడికల్ ఎమర్జెన్సీ కేసులకు తామెప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. దీనిపై నిరసనకు దిగిన వ్యక్తి వెంటనే స్పందించారు. గర్భిణిగా ఉన్న తన భార్యను ఇంటి నుంచి తీసుకువచ్చేందుకు తాను వెళ్తున్నానని, తాను నిరసనకు దిగిన సమయంలో ఆమె కారులో లేదని తెలిపారు. ఈ ఘటన క్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన నియోజకవర్గంలో పర్యటించేందుకు మెట్రో రైలులో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా వాహనంపై కోడిగుడ్లతో దాడి

గల్ఫ్‌లో మలయాళీ నర్సుల కష్టాలు.. పీఎం సాయం కోరిన సీఎం

Updated Date - Jun 07 , 2026 | 04:38 PM