Share News

ట్రైన్‌లో మీ వస్తువులు మర్చిపోయారా? వెంటనే ఇలా చేయండి..

ABN , Publish Date - Apr 26 , 2026 | 06:47 PM

ట్రైన్‌లో ప్రయాణిస్తూ మీ వస్తువులేమైనా మర్చిపోయారా? పోయిన/మర్చిపోయిన వస్తువులను ఎలా రాబట్టుకోవాలో తెలియక సతమతం అవుతున్నారా? టెన్షన్ పడకండి. రైలు ప్రయాణంలో మీ వస్తువులు ఏమైనా మర్చిపోతే వెంటనే ఈ పని చేయండి. మీ వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి..

ట్రైన్‌లో మీ వస్తువులు మర్చిపోయారా? వెంటనే ఇలా చేయండి..

సుదూర ప్రయాణాలు చేసేవారు దాదాపుగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. దూర ప్రయాణాలకు ట్రైన్ జర్నీ సౌకర్యవంతంగా ఉండటంతో పాటు.. తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే చాలామంది రైలు ప్రయాణాలకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే, రైళ్లలో ప్రయాణించేటప్పుడు కొందరు తొందరపాటు, అజాగ్రత్త కారణంగా తమ లగేజీని, ముఖ్యమైన వస్తువులను మర్చిపోతుంటారు. ఆ తరువాత తమ వస్తువులను ఎలా తిరిగి పొందాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. ఒకవేళ మీరు మీ వస్తువులను ట్రైన్‌లో మర్చిపోయినట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాస్త త్వరగా స్పందిస్తే చాలు.. మీ వస్తువులు, లగేజీని తిరిగి పొందే అవకాశం ఉంది.


ట్రైన్‌లో తమ వస్తువులు మర్చిపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ‘ఆపరేషన్ అమానత్’ ను తీసుకువచ్చింది. రైలు ప్రయాణంలో ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను భద్రపరిచి, వాటికి సంబంధించిన వివరాలను ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ఒకవేళ మీరు రైలులో మీ వస్తువులు మర్చిపోతే.. మీ వస్తువులు తిరిగి మీ వద్దకు రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.


ట్రైన్‌లో మీ వస్తువులు మర్చిపోతే వెంటనే ఈ పని చేయండి..

  • ట్రైన్ దిగిన తరువాత మీ వస్తువులు మర్చిపోయినట్లు గుర్తిస్తే.. వెంటనే రైల్వే స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ మాస్టర్‌కు విషయం తెలపండి.

  • వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి.. మీ బెర్త్, కోచ్, వదిలేసిన వస్తువుల వివరాలను తెలియజేయండి.

  • సాధ్యమైతే మీ కోచ్ అటెండెంట్ లేదా TTEని సంప్రదించండి. తద్వారా వారు మీ వస్తువులను సురక్షితంగా ఉంచే అవకాశం ఉంది.


రైల్వే శాఖ 'ఆపరేషన్ అమానత్'..

  • ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువుల ఫోటో, వివరాలను ఆర్పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్(ప్రాంతీయ వెబ్‌సైట్‌)‌లో అప్‌లోడ్ చేస్తుంది.

  • మొబైల్, కంప్యూటర్‌లో ‘ఆపరేషన్ అమానత్’ సైట్ ఓపెన్ చేసి మీరు ప్రయాణించిన రైలు, తేదీ వివరాలు నమోదు చేస్తే.. ఆ రోజున ప్రయాణికులు పొగొట్టుకున్న వస్తువుల వివరాలు కనిపిస్తాయి.

  • ఆపరేషన్ అమానత్ సైట్లో మీ వస్తువులు ఉన్నట్లయితే.. సైట్లో పేర్కొన్న రైల్వే స్టేషన్‌, ఆర్‌పీఎఫ్ పోస్ట్‌కు వెళ్లి మీ వస్తువులు తీసుకోవచ్చు.


పోయిన వస్తువులు తిరిగి పొందేందుకు చట్టపరమైన ప్రక్రియ..

  • ఒకవేళ మీరు రైలు ప్రయాణంలో మీ వస్తువులు పోగొట్టుకున్నట్లయితే.. ముందుగా జీఆర్‌పీ(GRP) స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.

  • మీ వస్తువులు తీసుకోవడానికి వెళ్లేటప్పుడు మీ ఆధార్ కార్డు, మీరు ప్రయాణించిన రైలు టిక్కెట్‌‌ను మీ వెంట తీసుకెళ్లాలి.

  • అసలైన యజమానిని నిర్ధారించుకోవడానికి ఆర్పీఎఫ్ అధికారులు వస్తువులకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వాటికి సరైన సమాధానం చెప్పి మీ వస్తువులను మీరు తీసుకోవచ్చు.


ఇది మర్చిపోవద్దు..

  • మీరు ట్రైన్‌లో సుదూర ప్రయాణం చేస్తున్నట్లయితే కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. మీరు మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి 15-20 నిమిషాల ముందు అలారం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ లగేజీని సర్దుకోవడానికి మీకు తగినంత సమయం ఉంటుంది.

  • మీ లగేజీని సులభంగా గుర్తించడానికి వీలుగా వాటిపై మీ పేరు, మొబైల్ నెంబర్ రాసిన ట్యాగ్‌ను పెట్టండి.

  • ట్రైన్ దిగే ముందు మీ సీటు కింద పరిసరాలను, పై బెర్త్‌ను క్షుణ్ణంగా చెక్ చేయండి.


Also Read:

ఐపీఎల్ 2026: రుతురాజ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ ముందు స్వల్ప లక్ష్యం

ఈ పెద్దాయనకు భయమంటే తెలియదేమో! ట్రంప్ కార్యక్రమంలో వైరల్ సీన్

విజయవాడ బస్టాండ్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..

Updated Date - Apr 26 , 2026 | 06:47 PM