కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:15 PM
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ అంశంలో భారత్‌పై పాక్ తప్పుడు ప్రచారం చేస్తూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది.
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్థాన్‌కు భారత్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ అంశంలో భారత్‌పై పాక్ తప్పుడు ప్రచారం చేస్తూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 'సహజ వనరుల పరిపాలన: శాంతి, భద్రత, అభివృద్ధికి పునాది' అనే అంశంపై ఉన్నతస్థాయి బహిరంగ చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న భారత శాశ్వత ప్రతినిధి రాయబారి పర్వతనేని హరీశ్.. పాకిస్థాన్‌కు కౌంటర్ ఇస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
యూఎన్ వేదికను దుర్వినియోగం చేస్తోంది: భారత్
చర్చ సందర్భంగా పాకిస్థాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పర్వతనేని హరీశ్.. ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావించే ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే భారత్‌పై తప్పుడు కథనాన్ని ప్రచారం చేయడానికి పాకిస్థాన్ ఈ వేదికను దుర్వినియోగం చేయడంతో స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. జమ్మూకశ్మీర్ విషయంలో రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఎలాంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. 'జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే. ఇది రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన వాస్తవం. పాకిస్థాన్ కావాలనే ఈ నిజాన్ని విస్మరిస్తోంది' అని పేర్కొన్నారు.
అసలు సమస్య పాక్ ఆక్రమణే..
జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఇంకా పరిష్కారం కావాల్సిన అంశం ఒక్కటే ఉందని పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు. భారత సార్వభౌమ భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించడమే అసలు సమస్యని స్పష్టం చేశారు. 'జమ్మూకశ్మీర్ విషయంలో మిగిలి ఉన్న ఏకైక సమస్య భారత భూభాగంపై పాకిస్థాన్ చేసిన బహిరంగ దురాక్రమణ, అక్రమ ఆక్రమణ మాత్రమే' అని ఆయన తేల్చి చెప్పారు.
సింధు జలాల ఒప్పందంపైనా స్పష్టత..
సింధు జలాల ఒప్పందం అంశంపైనా భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పరస్పర విశ్వాసం ఉన్నప్పుడే సహకారం సాధ్యమవుతుందని, ఒకవైపు సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు సహకారం ఆశించడం సాధ్యం కాదని పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు.
ముందు మీ దేశాన్ని చక్కదిద్దుకోండి..
చివరగా పాకిస్థాన్‌కు భారత ప్రతినిధి ఘాటు సూచన చేశారు. భారత్‌పై అంతర్జాతీయ వేదికలపైన నిరాధార ఆరోపణలు చేయడం కంటే ముందు తమ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. 'భారత్‌ను వేలెత్తి చూపే ముందు పాకిస్థాన్ తన ఇంటిని తాను చక్కదిద్దుకుంటే ఆ దేశానికీ, అక్కడి ప్రజలకూ ఎంతో మేలు జరుగుతుంది' అని పర్వతనేని హరీశ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..