Share News

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:34 AM

భారీ వర్షాలకు అస్సాం అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 24 గంటల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..
Assam floods

గౌహతి: భారీ వర్షాలు, వరదలకు అస్సాం అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు 24 గంటల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందగా.. చరైడియోలో ఇద్దరు, కర్బీ అంగ్లాంగ్, ధేమాజీల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 41కి చేరింది.


ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 11 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. శివసాగర్, చరైడియో, ధేమాజీ, దిబ్రూఘర్, గోలాఘాట్, హోజాయ్, జోర్హాట్, కమ్రూప్, కమ్రూప్ మెట్రోపాలిటన్, కర్బీ అంగ్లాంగ్, నాగావ్ జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆయా జిల్లాల్లోని 6,53,100 మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. అధికారిక నివేదిక ప్రకారం అస్సాం వ్యాప్తంగా 939 గ్రామాలు నీట మునిగాయి. 24,897.27 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతింది. 10 జిల్లాల్లో 487 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. 24,418 మందిని సురక్షితంగా తరలించారు.


మరోవైపు, రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వరదల తీవ్రత తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వానలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖోవాంగ్‌లోని బురీదిహింగ్ నది, శివసాగర్‌లోని దిఖౌ నది, నుమాలిగఢ్‌లోని ధన్‌సిరి, శ్రీభూమిలోని కుషియారా నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.


భారీ వర్షాలు, వరదలపై అస్సాం ముఖ్య కార్యదర్శి రవి కోట బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరమ్మతు, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆజ్ఞాపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీలో టెన్షన్ వాతావరణం.. 16 మెట్రో స్టేషన్ల మూసివేత..]\

'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ విమర్శలు

Updated Date - Jul 23 , 2026 | 11:42 AM