Share News

మయన్మార్‌తో సరిహద్దు వివాదం.. పరిష్కారం దిశగా చర్చలు!

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:35 PM

మణిపుర్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే దిశగా కేంద్రం ముందడుగేసింది. ఈ మేరకు భారత్, మయన్మార్ మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.

మయన్మార్‌తో సరిహద్దు వివాదం.. పరిష్కారం దిశగా చర్చలు!

ఇంటర్నెట్ డెస్క్: మణిపుర్‌లో దశాబ్దాలుగా పెండింగ్‌లో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి.. భారత్, మయన్మార్ ఓ భూభాగ మార్పిడి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సరిహద్దులో దశాబ్దాలుగా పరిష్కారం కాని ప్రాంతాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఇరు దేశాల మధ్య భూభాగ మార్పిడి ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే.. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. 'సరిహద్దులో ఇంకా పరిష్కరించని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటి పరిష్కరించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి' అని అన్నారు.


ఇటీవల వెలువడిన కథనాల ప్రకారం, మణిపుర్‌లోని చందేల్ జిల్లా, మయన్మార్‌లోని కబావ్ లోయ ప్రాంతం మధ్య సుమారు 1.4 చదరపు మైళ్ల భూభాగ మార్పిడి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ మార్పిడి ద్వారా సరిహద్దు స్తంభాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి, మిగిలిన సరిహద్దును కంచెతో భద్రపరచాలని యోచిస్తున్నట్టు ఉన్నట్లు సమాచారం. కాగా.. ఇరు దేశాల మధ్య మధ్య మొత్తం 1,643 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇందులో సుమారు 1,472 కి.మీ. బార్డర్‌కు గుర్తింపు పూర్తవ్వగా.. ఇంకా 171 కి.మీ. మేర పెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య కొనసాగుతోంది.


కేంద్ర ప్రభుత్వం అక్రమ చొరబాట్లు, తిరుగుబాటు కార్యకలాపాలు, సరిహద్దు నేరాలను అరికట్టే లక్ష్యంతో భారత్-మయన్మార్ సరిహద్దు మొత్తానికీ కంచె వేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరిహద్దు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు భూభాగ మార్పిడి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ ప్రతిపాదనపై మణిపుర్‌లోని పలు పౌర సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర భౌగోళిక సమగ్రతకు ఎలాంటి భంగం కలిగించే నిర్ణయాన్నీ అంగీకరించబోమని హెచ్చరిస్తున్నాయి. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేంద్రాన్ని కోరుతున్నాయి.


ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 05 , 2026 | 04:35 PM