త్వరలో పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు..
ABN , Publish Date - Jul 09 , 2026 | 09:12 PM
భారతదేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు త్వరలో పట్టాలెక్కనుంది. జులై 17న హర్యానాలోని జింద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ రైలు సర్వీస్‌ను ప్రారంభించనున్నారు.
న్యూఢిల్లీ, జులై 09: భారతదేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు త్వరలో పట్టాలెక్కనుంది. జులై 17న హర్యానాలోని జింద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ రైలు సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ జింద్ - సోనిపత్ మార్గంలో ఈ సర్వీస్ రెండు సార్లు నడపనున్నారు. డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా హైడోజన్‌తో ఈ రైలు నడుస్తుంది. ఇప్పటికే జర్మనీ, జపాన్, చైనా, అమెరికాలు హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్నాయి. దీంతో ఆయా దేశాల సరసన భారత్ కూడా చేరినట్లు అవుతుంది.
రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లతో ఈ సర్వీస్‌ను రూపొందించారు. ఈ రైలులో మొత్తం 2,600 మంది ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే బ్రాడ్ గేజ్‌పై నడిచే అత్యంత పొడవైన సర్వీస్‌గా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు.
ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తయారు చేశారు. తొలుత జింద్ - సోనిపట్ మార్గంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు నడవనుంది.
ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించారు. హైదరాబాద్‌కు చెందిన మేధా సెర్వో డ్రైవ్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌ను చేపట్టింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ స్టాక్‌ను కెనడాలోని బల్లార్డ్ పవర్ సిస్టమ్స్ సరఫరా చేసింది.
హర్యానాలోని జింద్‌లో ఓ ప్రత్యేక హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వతోపాటు ఇంధనం నింపే కేంద్రాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం రోజుకు 420-430 కిలోల హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితోపాటు 3 వేల కిలోల వరకు హైడ్రోజన్‌ను నిల్వ చేయగలదు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. దేశంలోని పలు మార్గాల్లో ఈ హైడ్రోజన్ రైలు సర్వీసులను ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో భారతీయ రైల్వే ఉంది.
ఇవి కూడా చదవండి..
మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్
ఫైవ్‌స్టార్ హోటళ్లలో బిల్లు చెల్లించకుండా ఉడాయిస్తూ.. చివరకు!
For More National News And Telugu News