మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:47 PM
నిత్యం బిజీ బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీరిక దొరికింది. ఈ నేపథ్యంలో ఆయన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
హైదరాబాద్, జులై 09: ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు.. మరోవైపు రాజకీయ వ్యవహారాలతో నిత్యం బిజీ బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి.. మనవడి కోసం వంట మనిషిగా మారారు. మనవడు అడగటం.. తాను చేయకపోవడమా.. అంటూ గరిట చేత పట్టారు. వంటగదిలోకి వెళ్లి.. మనవడిని పక్కన పెట్టుకుని పసందైన పూరీలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా’ అని మనవడు అడిగితే తప్పుతుందా? అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
ఈ వీడియో ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి వంట గదిలోకి వచ్చారు. ఓ వైపు తన మనవడిని కూర్చోబెట్టిన సీఎం.. మరోవైపు పిండి కలిపి, చపాతీ పీటపై పూరీలు చేశారు. ఆపై నూనె మరిగించి పూరీలు తయారు చేశారు. ఎన్ని పూరీలు కావాలి.. పూరీ రౌండ్‌గా వస్తుందా? లేదా? అంటూ సరదాగా మనవడితో ముచ్చటిస్తూ పూరీలు చేశారు సీఎం రేవంత్. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన ఆయన.. ‘‘తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా’ అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు.. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఇవి కూడా చదవండి..
ఫైవ్‌స్టార్ హోటళ్లలో బిల్లు చెల్లించకుండా ఉడాయిస్తూ.. చివరకు!
కాలు లేకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.. వీడియో వైరల్
For More Viral News And Telugu News