1.25 కోట్ల హిందువులకు అండగా నిలబడతాం.. బంగ్లాదేశ్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ హెచ్చరిక
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:29 PM
బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ గట్టి సంకేతాలు ఇచ్చారు. అక్కడి హిందువులంతా ఏకం కావాలని, తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ముంబై: బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) గట్టి సంకేతాలు ఇచ్చారు. అక్కడి హిందువులంతా ఏకం కావాలని, తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 'సంఘ్ ప్రయాణం.. కొత్త దిగంతాలు' అనే అంశంపై ముంబైలో ఆదివారం నాడు చేపట్టిన రెండ్రోజుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిపెట్టడంతో అక్కడి హిందువులపై జరుగుతున్న అమానుష దాడులు, హత్యాకాండలపై ఆయన మాట్లాడారు.
బంగ్లాదేశ్‌లో హిందువులు గణనీయంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, అక్కడ ఉంటున్న 1.25 కోట్ల మంది హిందువులు సమష్టి బలంతో రాజకీయ వ్యవస్థను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని, వ్యక్తిగత భద్రత, సంక్షేమానికి ఢోకా లేకుండా చూసుకోవాలని సూచించారు. 'ఇప్పటికి కూడా 1.25 కోట్ల హిందువులు అక్కడున్నారు. వాళ్లు తమ భద్రత, ప్రయోజనాలను కాపాడుకుకోవాలంటే ఐక్యంగా ఉండాలి. ఈసారి ఎట్టి పరిస్థితిల్లోనూ పారిపోయేది లేదని, బలంగా నిలబడి పోరాడతామని నిశ్చయించుకోవడం మంచిపరిణామం. ఇప్పుడు పోరాడదలిస్తే సమష్టి పోరాటం అనివార్యం. వాళ్లు ఎంత తర్వగా ఏకమైతే అంత మంచిది' అని మోహన్ భాగవత్ సూచించారు.
'హిందువులు ప్రస్తుతం తమకున్న బలంతో తమ పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చు. ఇది సాధించే విషయంలో ఇక్కడుంటున్న మనం, ప్రపంచ దేశాల్లో ఉంటున్న హిందువులు తమకున్న పరిధిలకు లోబడి వారికి చేయాల్సిందంతా చేయాలి. ఇందుకు నేను గ్యారెంటీ ఇస్తున్నాను' అని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..