Share News

అమెరికాతో ట్రేడ్ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపు

ABN , Publish Date - Feb 08 , 2026 | 05:17 PM

అమెరికాతో ట్రేడ్‌ డీల్‌తో భారత వ్యవసాయ రంగాన్ని అక్కడి కార్పొరేట్ కంపెనీలకు సరెండర్ చేసినట్టేనని రైతు సంఘాలు వ్యాఖ్యానించాయి. డీల్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త నిరసనలను చేపట్టనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపాయి.

అమెరికాతో ట్రేడ్ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపు
Farmers' Organizations Protests Against Ind- US Trade Deal

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై (Ind-US Trade Deal) పలు రైతు సంఘాలు (Farmers' Organizations) భగ్గుమన్నాయి. ఇది అమెరికా కార్పొరేట్ కంపెనీలకు భారత వ్యవసాయ రంగాన్ని సరెండర్ చేయడమేనని మండిపడ్డాయి. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్), ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) సహ పలు రైతు సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త నిరసనలను చేపట్టనున్నామని శనివారం ప్రకటించాయి (Protests on Feb 12).

అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంతో భారతీయ వ్యవసాయ రంగాన్ని అమెరికా కార్పొరేట్ కంపెనీలకు సరెండర్ చేసినట్టేనని ఎస్‌కేఎమ్ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వాణిజ్య ఒప్పందంపై ఆయన ప్రకటన అవాస్తవాలతో కూడుకున్నదని తెలిపింది. ట్రేడ్ డీల్‌పై సంతకాలు చేయొద్దని ప్రధాని మోదీని కోరింది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా భారీ నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గ్రామాల్లో నిరసనలు నిర్వహిస్తామని ఎస్‌కేఎమ్ లీడర్లు పత్రికా సమావేశంలో తెలిపారు. ఫిబ్రవరి 12న నిర్వహించనున్న స్ట్రైక్‌కు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.


పశుగ్రాసంగా వాడే అమెరికా ఎర్నజొన్నలు, సోయాబీన్ నూనె వంటి వాటిని భారత మార్కెట్‌లోకి అనుమతిస్తే దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని ఏఐకేఎస్ నేత కృష్ణ ప్రసాద్ అన్నారు. డెయిరీ రంగంపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారు. మందకొడిగా మారిన అమెరికా, ఐరోపా సమాఖ్య ఆర్థిక వ్యవస్థలకే ఈ ట్రేడ్ డీల్స్‌తో ప్రయోజనమని వ్యాఖ్యానించారు. భారత్‌కు పెద్దగా ఉపయోగం లేదని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీల దిష్టి బొమ్మలను దహనం చేసి తమ నిరసన తెలుపుతామని క్రాంతికారీ కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ తెలిపారు. అల్పాదాయాలు, అప్పులతో ఇబ్బంది పడుతున్న రైతాంగం పరిస్థితి ఈ ట్రేడ్ డీల్‌తో మరింత దిగజారుతుందని అన్నారు. ఈ ట్రేడ్ డీల్స్‌తో తమపై ఎలాంటి ప్రభావం పడుతుందని గ్రామస్తులు తమను ప్రశ్నిస్తున్నారని భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ తికాయత్ అన్నారు. ఈ నిరసనల్లో పాలుపంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.


ఈ వార్తలూ చదవండి:

ఎప్‌స్టీన్‌‌ను ఆయన ఎప్పుడూ కలవలేదు.. దలైలామా కార్యాలయం ఖండన

స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పరుగులు తీసిన జనం

Updated Date - Feb 08 , 2026 | 05:31 PM