Share News

ఎప్‌స్టీన్‌‌ను ఆయన ఎప్పుడూ కలవలేదు.. దలైలామా కార్యాలయం ఖండన

ABN , Publish Date - Feb 08 , 2026 | 03:54 PM

లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌‌తో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సంబధాలు ఉన్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మిడియా పోస్టులను ఆయన కార్యాలయం తీవ్రంగా ఖండించింది.

ఎప్‌స్టీన్‌‌ను ఆయన ఎప్పుడూ కలవలేదు.. దలైలామా కార్యాలయం ఖండన
Dalai Lama

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffery Epstein)తో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama)కు సంబంధాలు ఉన్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మిడియా పోస్టులను ఆయన కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఎప్‌స్టీన్‌ను దలైలామా ఎప్పుడూ కలవలేదని, ఆయన తరఫున మరెవరూ కూడా ఎప్‌స్టీన్‌తో సమావేశమయ్యేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపింది.


'ఎప్‌స్టీన్ ఫైల్స్'లోని వివరాలు బహిర్గతం కావడం అమెరికాలో సంచలనమవుతోంది. పిల్లల లైంగిక వేధింపుల నిందితుడు, సీరియల్ రేపిస్ట్‌ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయంటూ వివిధ దేశాల్లోని పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి వ్యక్తుల పేర్లు బహిర్గతమవుతున్నాయి. ఈ క్రమంలో దలైలామా పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఆయన కార్యాలయం వెంటనే ఖండించింది. ఎప్‌స్టీన్‌ను దలైలామా కలవడం కానీ, మరొకరిని కలుసుకునేందుకు అనుమతించడం కానీ ఎప్పుడూ జరగలేదని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.


అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు చెందిన 30 లక్షలకు పైగా ఫైళ్లు విడుదల చేసింది. అందులో 2,000కు పైగా వీడియోలు, సుమారు లక్షా ఎనభై వేల ఫోటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బిలియనీర్ ఎలాన్ మస్క్ వంటి పలువురి పేర్లు కూడా ఉన్నాయి. పేరు ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ పేర్లలో దలాలైమా పేరు కూడా ఉండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.


ఎవరీ ఎప్‌స్టీన్

జెఫ్రీ ఎప్‌స్టీన్ అమెరికాకు చెందిన ఫైనాన్షియర్. లైంగిక నేరాల దోషి. పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజిమెంట్ ద్వారా భారీగా సంపద కూడబెట్టాడు. హై-ప్రొఫైల్ క్లయింట్‌లకు పనిచేసేవాడు. బాలికలు, యువతులపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా కేసుల్లో దోషిగా తేలడంతో 2008లో ఫ్లోరిడాలో తొలిసారి ఆయన జైలుకు వెళ్లాడు. 2019లో ఫెడరల్ దర్యాప్తులో తిరిగి అరెస్టయ్యాడు. అయితే విచారణలో ఉండగానే జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు.


ఇవి కూడా చదవండి..

గొగోయ్‌కు పాక్ ఏజెంట్‌తో సంబంధాలు.. అసోం సీఎం సంచలన ఆరోపణ

భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..

Updated Date - Feb 08 , 2026 | 03:59 PM