Share News

గొగోయ్‌కు పాక్ ఏజెంట్‌తో సంబంధాలు.. అసోం సీఎం సంచలన ఆరోపణ

ABN , Publish Date - Feb 08 , 2026 | 03:03 PM

పాకిస్థాన్‌తో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు ఉన్న సంబంధాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఆయనను తమ ప్రభుత్వం అరెస్టు చేయాలనుకోవడం లేదని చెప్పారు.

గొగోయ్‌కు పాక్ ఏజెంట్‌తో సంబంధాలు.. అసోం సీఎం సంచలన ఆరోపణ
Himanta Biswa Sharma and Gaurav Gogoi

గువాహటి: పాకిస్థాన్‌తో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ (Gaurav Gogoi)కు ఉన్న సంబంధాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఆయనను తమ ప్రభుత్వం అరెస్టు చేయాలనుకోవడం లేదన్నారు. అలా చేస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుందుడుకు చర్యలు చేపట్టారంటూ ఆయన రాజకీయాలు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ వ్యహారాన్ని కేంద్రానికే వదిలిపెట్టామని, కేంద్ర దర్యాప్తునకు సిఫారసు చేస్తున్నామని చెప్పారు. ఆదివారంనాడు గువాహటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గొగోయ్‌ పదవిని గౌరవిస్తూ తమ ప్రభుత్వం ఇంతవరకూ ఆయనపై విచారణ జరపలేదని చెప్పారు. అయితే గొగోయ్, ఆయన భార్య ఎలిజిబెత్‌కు పాక్ ఏజెంట్ అలి తౌఖీర్ షేక్‌తో లోతైన సంబంధాలున్నాయని ఆరోపించారు. దీనిపై కేంద్ర దర్యాప్తునకు సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు.


కాంగ్రెస్‌ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2010-2013 మధ్య 13 సార్లు ఇండియాకు అలీ వచ్చారని, అసోం ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించడంతో ఆయన తన 'ఎక్స్' పోస్టులను తొలగించారని శర్మ తెలిపారు. పాకిస్థాన్ సంస్థ ఎలిజిబెత్‌కు ఉద్యోగం ఇచ్చి భారత్‌కు బదిలీ చేసిందని, ఆమె జీతాన్ని అలీ చెల్లించేవారని చెప్పారు. భారత ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ హయంలో అలీ పర్యటనలన్నీ జరిగాయని, కేంద్రంతో ఎలిజిబెత్, గొగోయ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో వీసాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే జారీ అయ్యాయని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి అలీ రావడం ఆపేశారని చెప్పారు. ఇండియాలో పర్యటనల సమయంలో అలీ తన వెంట పాకిస్థాన్ అధికారులను కూడా తీసుకువచ్చేవారని తెలిపారు.


ఇండియాకు సంబంధించిన పలు సమాచారాలను ఎలిజిబెత్ సేకరించి షేక్‌తో పంచుకునే వారని హిమంత బిశ్వా శర్మ ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాతావరణ చర్యలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని సేకరించారని, గొగోయ్ సైతం ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య పాకిస్థాన్ బ్యాంకు అకౌంట్‌ను ప్రస్తావించలేదని చెప్పారు. ఎలిజిబెత్ ఓ భారత సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆరుసార్లు ఇస్లామాబాద్ వెళ్లారని, మరో స్వచ్ఛంద సంస్థలో చేరినప్పుడు తిరిగి మూడుసార్లు పాకిస్థాన్ వెళ్లారని వెల్లడించారు. ఎవరికీ అనుమానంగా రాకుండా ఉండేందుకు పంజాబ్‌లోని అటారీ సరిహద్దు మీదుగానే ఆమె తన ప్రయాణాలు సాగించేవారని వివరించారు.


ఇవి కూడా చదవండి..

భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..

దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..

Updated Date - Feb 08 , 2026 | 06:12 PM