పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 03:16 PM
తన పదవీ విరమణపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయస్సుతో సంబంధం లేకుండా పదవిలో కొనసాగాలని సంఘ్ తనను కోరిందని తెలిపారు.
ముంబై, ఫిబ్రవరి 08: తన పదవీ విరమణపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయస్సుతో సంబంధం లేకుండా పదవిలో కొనసాగాలని సంఘ్ తనను కోరిందని తెలిపారు. ఒకవేళ పదవి నుంచి దిగిపోవాలని ఆదేశిస్తే.. తప్పుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మోహన్ భాగవత్ మాట్లాడుతూ...'ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఇంతవరకు ఎవరినీ పదవీ విరమణ చేయించాల్సిన పరిస్థితి రాలేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవికి ఎన్నికలు ఉండవు. ప్రాంతీయ, డివిజనల్ అధ్యక్షులు సర్‌సంఘ్‌చాలక్‌ను నియమిస్తారు. ఆర్ఎస్ఎస్ విధానాల ప్రకారం... 75 ఏళ్లు నిండిన తర్వాత ఎలాంటి పదవిలో లేకుండా పని చేయాలంటారు. నాకు 75 ఏళ్లు నిండాయి. ఈ విషయాన్ని సంఘ్‌కు కూడా తెలియజేశాను. కానీ నన్ను యథావిధిగా కొనసాగాలని కోరింది. పదవి నుంచి తప్పుకోవాలని ఎప్పుడు కోరినా రెడీగా ఉన్నాను. కానీ, పని నుంచి మాత్రం ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు’ అని భాగవత్ స్పష్టం చేశారు.
ఇదే కార్యక్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం, వీర్ సావర్కర్ గురించి భాగవత్ ప్రస్తావించారు. 'వీర్ సావర్కర్‌కు భారతరత్న పురస్కారం ఇస్తే దాని ప్రతిష్ఠ పెరుగుతుంది. అలానే దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా భారత్- అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు భావిస్తున్నాను. అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకొని ‘ఉమ్మడి పౌరస్మృతి’ రూపొందించాలి, అది విభేదాలకు దారితీయకూడదు' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..
దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..