Share News

కర్రెగుట్టపై తొలిసారి గణతంత్ర వేడుకలు

ABN , Publish Date - Jan 26 , 2026 | 01:17 PM

నక్సల్స్ కంచుకోటగా భావించే ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టపై గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్రం అనంతరం.. తొలిసారి ఈ ప్రాంతంలో జాతీయ పతాకావిష్కరణ జరిగింది.

కర్రెగుట్టపై తొలిసారి గణతంత్ర వేడుకలు
Karregutta Hills

ఛత్తీస్‌గఢ్, జనవరి 26: దక్షిణ బస్తర్ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో 77వ గణతంత్ర వేడుకలు(Republic Day) అత్యంత వైభవంగా జరిగాయి. స్వాతంత్య్రం అనంతరం.. తొలిసారిగా బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట కొండలపై జాతీయ పతాకావిష్కరణ జరిగింది. ఈ కొండలను నక్సలైట్లు తమ కంచుకోటగా భావించడంతో.. అక్కడ ఇప్పటివరకు ఎలాంటి జాతీయ వేడుకలు జరగలేదు. కానీ ఇటీవలి కాలంలో ఆపరేషన్ కగార్ ద్వారా భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.


దీంతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కర్రెగుట్ట కొండలపై తొలిసారి జెండావిష్కరణ జరిగింది. తాడ్‌పాల క్యాంపు వద్ద(CRPF) 196వ బెటాలియన్, CoBRA 204వ బెటాలియన్ జవాన్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కర్రెగుట్ట కొండపై జవాన్లు గర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి గీతాలను ఆలపించారు.


2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్‌’ను చేపట్టింది. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను మావోయిస్టులు కంచుకోటగా భావించారు. దీంతో ఆ ప్రాంతంలో మావోయిస్టులను పట్టుకునేందుకు గత ఏడాది(2025) భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ చేపట్టాయి. దాదాపు 20 వేల మంది భద్రతా బలగాలు ఈ కొండలను చుట్టుముట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు ఉపయోగించి దట్టమైన అడవుల్లో జల్లెడ పట్టారు. ఆపరేషన్‌లో భాగంగా భారీ ఎన్‌కౌంటర్లు జరగ్గా.. సుమారు 31 మంది మావోయిస్టులు మృతి చెందారు.

అయితే ఈ ఆపరేషన్‌ను ఆపాలంటూ కేంద్రానికి మావోయిస్టులు పలుమార్లు లేఖలు రాసినప్పటికీ కాల్పులు కొనసాగాయి. చివరకు గతేడాది మే నెలలో కర్రెగుట్టలో ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించిన భద్రతా బలగాలు.. ఆ కొండపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాయి.


ఇవి కూడా చదవండి...

వారందరూ దేశానికి గట్టి పునాదులు వేశారు: టీపీసీసీ చీఫ్

రిపబ్లిక్ డే సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు.. దేశ రాజధాని ఢిల్లీ, LoC వద్ద హై అలర్ట్

Read Latest National News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 01:51 PM