రిపబ్లిక్ డే సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు.. దేశ రాజధాని ఢిల్లీ, LoC వద్ద హై అలర్ట్
ABN , Publish Date - Jan 26 , 2026 | 06:56 AM
77వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం జరిగే పరేడ్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు, పారామిలిటరీ దళాలు, సైన్యం సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేశాయి.
ఆంధ్రజ్యోతి, జనవరి 26: దేశంలో ఇవాళ(సోమవారం) 77వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్(National Capital Region) ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. హస్తినలో ఈ ఉదయం (జనవరి 26) జరిగే పరేడ్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు, పారామిలిటరీ దళాలు, సైన్యం సంయుక్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి.
ఢిల్లీలోని గురుగ్రామ్, చిల్లా, తిక్రి, సింఘు, కపాశేరా, బదర్‌పూర్, ధౌలా కువాన్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు మరింత పటిష్టంగా చేస్తున్నారు. రాజధానిలో మల్టీ-లేయర్ సెక్యూరిటీ, సీసీటీవీలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, AI స్మార్ట్ గ్లాసెస్ వంటి అధునాతన సాంకేతికతలతో భద్రతను బలోపేతం చేశారు.
తనిఖీల కోసం దాదాపు 30,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) దగ్గర, ముఖ్యంగా బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో భారత సైన్యం అత్యంత జాగ్రత్తగా గస్తీ, వాహన తనిఖీలు నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ సరిహద్దులు (IBs), విలేజ్ రక్షణ గార్డులు (VDG), BSF, CRPF, పోలీసు దళాలు కలిసి పనిచేస్తున్నాయి. చలిని లెక్కచేయకుండా సైనికులు అవిరామంగా ప్రజల భద్రత కోసం పనిచేస్తున్నారు. ఈ ఏర్పాట్లతో దేశవ్యాప్తంగా నిర్విఘ్నంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
Read Latest National News