అస్సాంలో ఎన్డీయే సీట్ల పంపకాల ఫార్ములా.. ఒకటి రెండ్రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా
ABN , Publish Date - Mar 17 , 2026 | 09:26 PM
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వాముల మధ్య సీట్ల పంపకాల ఫార్ములాను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బీజేపీ 89 సీట్లలో, భాగస్వామ్య పక్షాలైన అసోం గణ పరిషత్ 26 స్థానాల్లో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 11 సీట్లలో పోటీ చేయనున్నట్టు చెప్పారు.
న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వాముల మధ్య సీట్ల పంపకాల ఫార్ములాను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) వెల్లడించారు. బీజేపీ (BJP) 89 సీట్లలో, భాగస్వామ్య పక్షాలైన అసోం గణ పరిషత్ (AGP) 26 స్థానాల్లో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) 11 సీట్లలో పోటీ చేయనున్నట్టు చెప్పారు. న్యూఢిల్లీలో మంగళవారంనాడు పార్టీ జాబితాపై ప్రాథమిక చర్చలు జరిపిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశమవుతుందనీ, ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను బుధవారం రాత్రి కానీ, గురువారం ఉదయం కానీ ప్రకటిస్తామని తెలిపారు.
గత ఎన్నికల్లో..
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 93 సీట్లలో పోటీ చేసి 60 స్థానాలు గెలుచుకుంది. ఏజీపీకి 25 సీట్లు కేటాయించగా, 29 స్థానాల్లో పోటీ చేసి 9 చోట్ల గెలిచింది. యూపీపీఎల్‌కు 9 సీట్లు కేటాయించగా, 11 నియోజకవర్గాల్లో పోటీచేసి 6 చోట్ల గెలిచింది. 126 మంది సభ్యుల అసోం అసెంబ్లీలో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకుంది.
ఫ్రెండ్లీ ఫైట్
బీజేపీ, ఏజీపీలు ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నప్పటికీ లఖింపూర్, నహర్‌కటియా, పతర్కండి, అల్గాపూర్ నియోజకవర్గాల్లో 'ఫ్రెండీ ఫైట్' జరిగింది. బీజేపీ, యూపీపీఎల్ సైతం బిజ్ని, కలైగావ్, మత్‌బత్‌లో 'స్నేహపూర్వకంగా' పోటీ చేశాయి. కాగా, 2024 అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న, కౌంటింగ్ మే 4న జరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
దీదీ వర్సెస్ సువేందు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
నా కలను నెరవేరుస్తారా.. నయనతారపై తమిళనాడు ఎంపీ అనుచిత వ్యాఖ్యలు..