కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి అమానుషం... తీవ్రంగా ఖండించిన భారత్
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:11 PM
అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ ఆసుపత్రిపై మార్చి 16వ తేదీ రాత్రి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 400కు చేరింది. ఇది అత్యంత అమానుష ఘటన అంటూ పాక్ దుశ్చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది.
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ (Afghanistan)లోని కాబూల్ ఆసుపత్రిపై మార్చి 16వ తేదీ రాత్రి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 400కు చేరింది. ఇది అత్యంత అమానుష ఘటన అంటూ పాక్ దుశ్చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద చర్య అని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
'పాకిస్థాన్ జరిపిన వాయుదాడిని భారత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది. ఇది పిరికిపంద చర్య. దుర్మార్గమైన హింసాత్మక చర్య. పెద్ద సంఖ్యలో పౌరులు మరణించారు. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్‌గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇది అఫ్గాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అస్థిరతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుకు ఆవల దాడులకు దిగడం పాకిస్థాన్ బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని చాటుతుంది' అని విదేశాంగ శాఖ తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడులకు పాల్పడటం మరింత దారుణమని, నమ్మకాలు, చట్టాలు, నైతికత లేకుండా ఆసుపత్రులు, పేషెంట్లపై దాడి చేశారని విమర్శించింది. ఇలాంటి దాడులకు పాల్పడేవారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలని భారత్ సూచించింది. మృతులు, వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ విషాద సమయంలో అఫ్గాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నామని, అఫ్గాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.. రజనీకాంత్
మోదీని కలిసిన వరుణ్ గాంధీ.. మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనే అవకాశం