Share News

కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.. రజనీకాంత్

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:09 PM

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుందని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున ఈనెల 12న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ ఆరోపణలను రజనీకాంత్ తోసిపుచ్చారు.

కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.. రజనీకాంత్
Rajanikanth and Aadhav Arjuna

చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajanikanth) గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుందని, ఆయనను బెదిరించిందని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున (Aadhav Arjuna) ఈనెల 12న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఆరోపణలపై డీఎంకేతో పాటు రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగునున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై రజనీకాంత్ తాజాగా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందించారు. 'అవన్నీ అసత్య ఆరోపణలే' అంటూ టీవీకే నేత వ్యాఖ్యలను ఖండించారు.


'టీవీకే పార్టీ నేతగా ఉన్న ఆదవ్ ఆర్జున ఇటీవల నాపై ఒక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన పూర్తిగా సత్యదూరం, అవాస్తవం. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిలిచిన తమిళనాడు విపక్ష నేత ఎడప్పాడి కె.పళనిస్వామి, బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్.మురుగున్, తమిళనాడు మంత్రి రఘపతి, టీ తిరుమావలన్, ఎస్‌పీ వేలుమణి, నా మిత్రుడు అన్నామలై, అర్జున్‌మూర్తి, అన్బుమణి రామదాస్, జీకే వాసన్, జాన్ పాండియన్, పుగళేంది తదితర రాజకీయ నాయకులకు కృతజ్ఞతలు. అమీర్, జీ ధనరాజన్, నక్కీరన్ గోపాలన్, రంగరాజ్ పాండ్యా, మీడియా మిత్రులు, నా అభిమాన దేవుళ్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాలం మాట్లాడకపోవచ్చు, కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. లాంగ్ లివ్ తమిళ్‌నాడు, లాంగ్ లివ్ పీపుల్ ఆఫ్ తమిళనాడు, జైహింద్.. విత్‌ లవ్, రజనీకాంత్' అని ఆ పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు.


రజనీకాంత్ 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని, 'రజనీ మక్కల్ మండ్రం' పేరుతో రాజకీయ పార్టీ పెడతారని అప్పట్లో బలమైన ఊహాగానాలు వినిపించాయి. అయితే తన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆ ఆలోచన విరమించుకున్నట్టు రజనీకాంత్ ప్రకటించారు. కాగా, 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

మోదీని కలిసిన వరుణ్ గాంధీ.. మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనే అవకాశం

గుజరాత్‌ కాండ్లా పోర్టుకు వస్తున్న మరో రెండు నౌకలు

Updated Date - Mar 17 , 2026 | 05:50 PM