Share News

మోదీని కలిసిన వరుణ్ గాంధీ.. మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనే అవకాశం

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:06 PM

పశ్చిమబెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రకటించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ ఎంపీ వరుణ్ గాంధీ తన భార్య, కుమార్తెతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారంనాడు కలుసుకున్నారు.

మోదీని కలిసిన వరుణ్ గాంధీ.. మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనే అవకాశం
Varun Gandhi family meets PM Modi

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రకటించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) తన భార్య, కుమార్తెతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendr Modi)ని మంగళవారంనాడు కలుసుకున్నారు. ఆయన ఆశీస్సులు, మారదర్శకత్వాన్ని కోరుకున్నారు. ప్రధానిని కలిసిన ఫోటోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు చేశారు. తమ మధ్య అర్ధవంతమైన భేటీ జరిగిందని, భరోసా కలిగించే చక్కటి అనుభవం తనకు కలిగిందని వరుణ్‌గాంధీ పేర్కొన్నారు.


ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం అందుకునేందుకు మోదీని కలవడం తన అదృష్టంగా భావిస్తున్నానని వరుణ్‌గాంధీ పేర్కొన్నారు. ఒక తండ్రి సమక్షంలో ఉన్నంత భరోసా తనకు కలిగిందని, ఈ దేశానికి, ప్రజలకు నిజమైన పరిరక్షకులుగా ప్రధాని నిలుస్తున్నారనే నమ్మకం మరింత బలపడిందని ఆ ట్వీట్‌లో తెలిపారు.


బీజేపీతో కొద్దికాలంగా బలహీనపడిన సంబంధాలు

మూడుసార్లు ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి, బీజేపీకి మధ్య సంబంధాలు కొద్దికాలంగా బలహీనపడ్డాయి. 2009 నుంచి 2019 వరకూ ఆయన యూపీలోని పిలిభిత్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించింది. ఆ సీటును జితిన్ ప్రసాదకు ఇవ్వడం, ఆయన గెలవడంతో కేంద్ర మంత్రి కావడం జరిగింది. వరుణ్ గాంధీ తల్లి, బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీకి సుల్తాన్‌పూర్ నుంచి బీజేపీ టిక్కెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలయ్యారు. కీలకమైన సంస్థాగత పదవుల నుంచి కూడా ఆమెను తొలగించడంతో బీజేపీకి, గాంధీ కుటుంబానికి మధ్య మరింత దూరం పెరిగింది. రైతుల అంశాలు, యువతకు సంబంధించిన అంశాలతో సహా పలు అంశాలపై వరుణ్ గాంధీ ప్రభుత్వ విధానాలను విమర్శించిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి.


తిరిగి రాజకీయాల్లోకి..

వరుణ్ గాంధీ తాజాగా ప్రధానిని కలుసుకోవడం, ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుకోరడం, ప్రధాని నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం కీలక పరిణామంగా చెబుతున్నారు. తిరిగి పార్టీలో చురుకుగా పనిచేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సంస్థాగత మార్పులు జరుగుతుండటం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో మోదీని వరుణ్‌గాంధీ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో బీజేపీలో వరుణ్‌గాంధీ కీలక పాత్ర పోషించారు. జనరల్ సెక్రటరీగా, పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జిగా కూడా పనిచేశారు.


ఇవి కూడా చదవండి..

గుజరాత్‌ కాండ్లా పోర్టుకు వస్తున్న మరో రెండు నౌకలు

పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం ఉండాలి.. కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన

Updated Date - Mar 17 , 2026 | 03:12 PM