మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్.. 8 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Oct 18 , 2026 | 08:06 PM
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ శీత్లామాత ఆలయం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్ కఠిన చర్యలకు ఆదేశించారు. సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు ఎనిమిది మంది పోలీసులను సస్పెండ్ చేశారు.
భోపాల్, అక్టోబర్ 18: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ శీత్లామాత ఆలయం వద్ద 14 మంది భక్తుల మృతికి కారణమైన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. భద్రతా నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగాల నుంచి తొలగింపు, సస్పెన్షన్లు
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించారు. ముగ్గురు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు , ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లతో సహా మొత్తం 8 మంది పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు.
సమగ్ర దర్యాప్తుకు ఆదేశం
ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించనున్నట్లు తెలిపారు.
పోలీస్ చెక్‌పోస్ట్ వైఫల్యం
నవరాత్రి వేళ ఛిన్నోర్ వైపు నుంచి వస్తున్న ధాన్యం లోడు ట్రక్కు అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ బారికేడ్లు, చెక్‌పోస్టులను ధ్వంసం చేస్తూ ఆలయ బయటి గోడను ఢీకొట్టింది. అంతటి రద్దీ ఉన్న ప్రదేశంలోకి ట్రక్కు చెక్‌పోస్టు దాటుకుని ఎలా వచ్చిందనే దానిపై బాధితుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరగా, ముగ్గురి నుంచి నలుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ
Read Latest AP News And Telugu News