రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు
ABN , Publish Date - Nov 13 , 2026 | 09:03 PM
ర్యాపిడో బైక్‌ను ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. 40 గంటల తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ర్యాపిడో బైక్‌ను ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. 40 గంటల తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని బాపునగర్ ఎమ్మెల్యే దినేశ్‌సింగ్ కుష్వాహా సోదరుడి కొడుకు రాఘవేంద్ర కుష్వాహా ఈనెల 11న ఉదయం రేంజ్ రోవర్ కారులో వెళుతూ ర్యాపిడో బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ర్యాపిడో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి చనిపోయాడు. మృతుడిని హర్ష్‌భాయ్ పుర్బియా (35) గా గుర్తించారు. అహ్మదాబాద్‌లోని శిలాజ్ సర్కిల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రాఘవేంద్ర తన నలుగురు స్నేహితులతో కలిసి గాంధీనగర్ జిల్లా కల్లోల్ ప్రాంతంలో రాత్రంతా పార్టీ చేసుకుని తిరిగి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే రాఘవేంద్ర, అతడి స్నేహితులు కారులో అక్కడి నుంచి పారిపోయారు. అయితే నిందితుడిని పోలీసులు కాపాడేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ప్రమాదం తర్వాత అతడికి వైద్య పరీక్షలు నిర్వహించలేదని, పోలీస్ స్టేషన్‌లోనే బెయిల్ మంజూరు చేశారని విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా రాఘవేంద్ర కుష్వాహానే కారు నడిపాడని నిర్ధారించారు. ప్రమాద జరిగిన 40 గంటల తర్వాత అహ్మదాబాద్ సమీపంలోని బోపాల్‌లో అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాఘవేంద్ర.. ప్రమాదం జరిగిన తర్వాత భయంతోనే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పాడు. ఆ సమయంలో తాను మద్యం సేవించలేదని పేర్కొన్నాడు.
ఈ వార్తలూ చదవండి
జేఎన్‌టీయూ సెక్యూరిటీ టెండర్లు పై హైకోర్టు స్టే
నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..
సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..