Share News

ఫేస్‌బుక్ పరిచయం చివరకు విషాదం.. మహిళను ఇటుకతో కొట్టి చంపిన వ్యక్తి!

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:10 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం కాస్తా ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది.

ఫేస్‌బుక్ పరిచయం చివరకు విషాదం.. మహిళను ఇటుకతో కొట్టి చంపిన వ్యక్తి!
Ghaziabad Crime News

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రాణం తీసే ఘాతుకానికి దారితీసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో జరిగిన చిన్న గొడవ ఒక మహిళ హత్యకు కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని బులంద్‌షహర్‌ ప్రాంతంలో పింకీ అనే మహిళ నివాసం ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన పింటు అనే వ్యక్తి.. పింకీకి నాలుగు నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ స్నేహితులుగా మారి... ఆ తర్వాత సన్నిహితంగా మెలిగారు. ఈ క్రమంలో సోమవారం పింటు.. పింకీని కలిసేందుకు ఆమె వద్దకు వెళ్లాడు.


అయితే, ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో విషయమై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో కోపోద్రిక్తుడైన పింటు, అక్కడే ఉన్న ఇటుకతో పింకీ తలపై బలంగా బాదాడు. తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న వెంటనే లోనీ బోర్డర్ పోలీసులు, సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు పింటును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు అసలు కారణాలు తెలియాల్సి ఉందని ఏసీపీ అన్సూర్ విహార్ అమర్‌దీప్ మౌర్య తెలిపారు. సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి ప్రమాదకరంగా మారుతున్నాయో ఇప్పటికే అనేక ఘటనలు తెలియజేయగా... తాజాగా ఈ ఘటన మరోసారి నిరూపించింది.


ఇవీ చదవండి:

రూ.37 లక్షల జీతం.. 6 నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బ్లూ టిక్స్‌ పడకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

Updated Date - Nov 10 , 2026 | 12:46 PM