Share News

టీఎంసీ అగ్రనేత ముకుల్‌రాయ్ కన్నుమూత

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:58 PM

కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ (Mukul Roy) కన్నుమూశారు. కోల్‌కతా ఆసుపత్రులో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

టీఎంసీ అగ్రనేత ముకుల్‌రాయ్ కన్నుమూత
Mukul Roy

కోల్‌కతా: కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ (Mukul Roy) కన్నుమూశారు. కోల్‌కతా ఆసుపత్రులో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ముకుల్ రాయ్ వయస్సు 71 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో గత రెండేళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్న తన తండ్రి గుండెపోటుతో కన్నుమూసినట్టు ముకుల్ రాయ్ కుమారుడు సుభాన్షు రాయ్ తెలిపారు.


సంతాపాల వెల్లువ

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థుడుగా, టీఎంసీలో రెండో శక్తివంతమైన నేతగా ముకుల్ రాయ్ పేరు పొందారు. బెంగాల్‌లో టీఎంసీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ రాజకీయ చాణక్యుడిగా ఆయనను పిలిచేవారు. ముకుల్‌రాయ్ మృతివార్త తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలు పార్టీల నేతలు తీవ్ర సంతాపం తెలియజేశారు. ముకుల్‌రాయ్ రాజకీయంగా తన చిరకాల సన్నిహితుడని, రాజకీయ పోరాటాలను ఎదుర్కొన్న ధీశాలి అని మమతాబెనర్జీ అభివర్ణించారు. టీఎంసీ ఆవిర్భావం నుంచి తన జీవితాన్ని పార్టీకే అంకితం చేశారని, కేంద్ర మంత్రిగానూ సేవలందించారని గుర్తు చేసుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్ మృతితో బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక శకం ముగిసిందని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ అన్నారు. ముకుల్ రాయ్ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ముకుల్ రాయ్ మృతి తనను విషాదంలో ముంచిందని బీజేపీ నేత సువేందు అధికారి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. ముకుల్‌రాయ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.


మోదీ సంతాపం

కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రాజకీయ అనుభవం, సమాజసేవ పరంగా ఆయన గుర్తుండిపోతారని అన్నారు. ముకుల్ రాయ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకున్నారు.


ముకుల్‌రాయ్ జర్నీ..

ముకుల్‌ రాయ్ యువజన కాంగ్రెస్ నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు దశాబ్దాల లెఫ్ట్ ఫ్రెంట్ పాలనకు చరమగీతం పాడి, టీఎంసీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక వహించారు. 2009-2014 మధ్య కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరేళ్ల పాటు టీఎంసీ సస్పెండ్ చేయడంతో 2017 అక్టోబర్‌లో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి, టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. అదే ఏడాది బీజేపీలో చేరి జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై గెలిచారు. అయితే ఆ తర్వాత టీఎంసీ గూటికి తిరిగొచ్చారు.


ఇవి కూడా చదవండి..

దేవ్‌జీ లొంగుబాటు!

గ్రాండ్‌ సక్సెస్‌ దిశగా ఆపరేషన్‌ కగార్‌

Updated Date - Feb 23 , 2026 | 03:01 PM