దేవ్‌జీ లొంగుబాటు!
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:53 AM
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు....
మావోయిస్టు అగ్రనేతతో పాటు మల్లా రాజిరెడ్డి సహా 25 మంది కూడా..
తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం వెల్లడి
నేడో, రేపో రాష్ట్ర పోలీసుల ప్రకటన
సీఎం రేవంత్ సమక్షంలో లొంగుబాటును చూపే అవకాశం
హైదరాబాద్/కోరుట్ల/మంథని, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యుడైన నర్సింహారెడ్డితో పాటు మొత్తం 25 మంది ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటును రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి నిర్ధారించారు. దేవ్‌జీతో పాటు మరికొందరు మావోయిస్టులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కూడా చెప్పారు. మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో తెలంగాణ వ్యక్తులు 15 మంది ఉన్నారని.. వారంతా లొంగిపోవాలని ఇటీవల రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. వాస్తవానికి మల్లోజుల లొంగుబాటు తర్వాత వరసగా వివిధ స్థాయుల్లో ఉన్న మావోయిస్టు క్యాడర్ లొంగుబాటుకు తెలంగాణను వేదికగా చేసుకున్నారు. ఇదే క్రమంలో గత కొన్నాళ్లుగా కరీంనగర్‌కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, రాజిరెడ్డిల లొంగుబాటుకు సానుకూల వాతావరణం కల్పించాలని ప్రజాసంఘాల నేతలు, మేధావులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల ఆపరేషన్ కర్రెగుట్టల పేరిట వేలాది సాయుధ బలగాలను రంగంలో దింపి కేంద్రం మరోసారి మావోయిస్టుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో ప్రాణహాని లేకుండా చూస్తే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు దేవ్‌జీ తదితరుల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన మావోయిస్టుల్లో దేవ్‌జీ అంగరక్షకులు నలుగురు ఉండడం అనుమానాలకు తావిచ్చింది. ఆయన కదలికల సమాచారం నిఘా వర్గాలకు ఎప్పటికప్పుడు అందుతుందనే అనుమానాలు దీంతో బలపడ్డాయి. కాగా, మావోయిస్టుల లొంగుబాటును సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చూపాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేవ్‌జీ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ శకం ముగిసినట్లేనని ప్రజా సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ ఇంకా లభించలేదని సమాచారం. ఆయన విదేశాలకు వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది.
దేవ్‌జీ ఆయుధాల తయారీలో దిట్ట
జగిత్యాల జిల్లా కోరుట్లలోని అంబేడ్కర్‌నగర్ కాలనీకి చెందిన తిప్పిరి వెంకట నర్సయ్య, గంగుబాయికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వారిలో తిరుపతి పెద్ద కుమారుడు. తిరుపతి ఇంటర్మీడియట్ వరకు కోరుట్లలో చదువుకున్నారు. కరీంనగర్‌లో డిగ్రీ చదువుతున్న సమయంలో 1984లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. క్రమంగా మావోయిస్టు దళ నాయకుడిగా ఎదిగారు. దేవ్‌జీకి ఆయుధాల తయారీలో దిట్ట అనే పేరుంది. మావోయిస్టు మహిళా నాయకురాలు, నల్లగొండ జిల్లాకు చెందిన సృజనను అజ్ఞాతంలోఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతిచెందారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి 2025 సెప్టెంబరులో నియమితులయ్యారు. ఇదిలా ఉండగా, పెదనాన్న దేవ్‌జీ తమకు కొండంత ధైర్యమని ఆయన తమ్ముడి కూతురు సుమ అన్నారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నాడన్న సమాచారంతో దేవ్‌జీ తమ్ముడు గంగాధర్, సుమ భావోద్వేగానికి లోనయ్యారు.
మల్లా రాజిరెడ్డి లొంగుబాటు
మావోయిస్టు పార్టీ తొలితరం అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ సంగ్రామ్ పోలీసులకు లొంగిపోయారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని శాస్త్రులపల్లికి చెందిన రాజిరెడ్డి మంథనిలో ఇంటర్ చదువుతూ 1975లో పీపుల్స్‌వార్ అనుబంధ ఆర్‌ఎ్‌సయూ ద్వారా విప్లవ రాజకీయాల్లో చేరారు. అనంతరం పీపుల్స్‌వార్ మంథని దళంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడిగా చేరిన రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో స్థాయికి ఎదిగారు.