గ్రాండ్ సక్సెస్ దిశగా ఆపరేషన్ కగార్
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:50 AM
దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్లేనా? కేంద్రప్రభుత్వం విధించిన గడువు కంటే ముందే ఆపరేషన్ కగార్ విజయవంత మవుతోందా...
హైదరాబాద్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్లేనా? కేంద్రప్రభుత్వం విధించిన గడువు కంటే ముందే ఆపరేషన్ కగార్ విజయవంత మవుతోందా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. కొన్ని దశాబ్దాలుగా జనతన సర్కార్ లాంటి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీ ఇక ఉనికి కోల్పోయినట్లేనని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మావోయిస్టు రహిత దేశం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు ఈ ఏడాది మార్చి 31వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. మావోయిస్టు రహిత దేశం లక్ష్యంలో చివరి దశకు చేరుకున్నామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలో రాయ్‌పూర్‌లో కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు, నిఘా విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై అడవుల్లో మిగిలిన మావోయిస్టుల ఏరివేత విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ తర్వాతఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా పోలీసులు మరో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించి, నిఘా సమాచారాన్ని పంచుకుంటూ కీలక మావోయిస్టు నేత లోకేటిచందర్‌తో పాటు నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత దేవ్‌జీ లక్ష్యంగా కర్రెగుట్టలపై కేంద్ర బలగాలను మోహరించి ఒత్తిడి పెంచారు. వాస్తవానికి 2019 నుంచి మావోయిస్టు పార్టీని టార్గెట్ చేసిన కేంద్రం.. పెద్ద ఎత్తున్న సీఆర్‌పీఎఫ్ దళాలను మోహరించి ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టింది. సీఆర్‌పీఎ్‌ఫలోని కోబ్రా దళాలు మావోయిస్టుల అడ్డాల్లో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసుకుని వేట కొనసాగించాయి. మొదటి దశలో 24 బేస్‌క్యాంపులను ఏర్పాటు చేసుకుని మావోయిస్టుల కదలికలకు చెక్ పెట్టారు. 2020లో బేస్‌క్యాంపుల సంఖ్యను 40కి పెంచారు. ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతాల్లో 400 బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం భద్రతా బలగాలు సాధించిన విజయంగా చెప్పవచ్చు. ఒక్కో క్యాంపులో 200-400 మంది సాయుధ పోలీసులు ఉంటారు. వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. నైట్ విజన్ పరికరాలు, డ్రోన్లు వాడుతూ రాత్రివేళల్లో కూడా మావోయిస్టుల కదలికలను కట్టడి చేశారు. 2019 నాటికి తెలంగాణ, ఏపీ, ఛత్తీ్‌సగఢ్, బిహార్, మహారాష్ట్ర, ఒడిశా తదితర పది రాష్ట్రాల్లోని 61 జిల్లాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు జోరుగా సాగుతుండేవి. ప్రస్తుతం వారు పది జిల్లాలకే పరిమితమయ్యారు.