Share News

రాజస్థాన్ వీడియోతో పంజాబ్‌లో రాజకీయ దుమారం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:29 AM

మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను పంజాబ్‌లో ‘జాంబీ డ్రగ్’ సమస్యకు నిదర్శనంగా పేర్కొంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో పంజాబ్‌లో ఆప్, బీజేపీ మధ్య కొత్త రాజకీయ వివాదానికి కారణమైంది.

రాజస్థాన్ వీడియోతో పంజాబ్‌లో రాజకీయ దుమారం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

చండీగఢ్: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మధ్య కొత్త రాజకీయ వివాదానికి కారణమైంది. మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను పంజాబ్‌లో ‘జాంబీ డ్రగ్’ సమస్యకు నిదర్శనంగా పేర్కొంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ వీడియో పంజాబ్‌కు చెందినది కాదని.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో చిత్రీకరించిందని పంజాబ్ మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ స్పష్టం చేశారు.


హర్భజన్ సింగ్ షేర్ చేసిన వీడియోలో తలపాగాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై తడబడుతూ, నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు. ఈ దృశ్యాలను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు మాదకద్రవ్యాల ప్రభావంతో ఉన్నవారిగా పేర్కొన్నారు. దీంతో పంజాబ్‌లో డ్రగ్స్ పరిస్థితిపై చర్చకు దారితీసింది. రాష్ట్ర యువతకు మెరుగైన భవిష్యత్తు అవసరమని, సమస్యపై నిజాయితీ, బాధ్యతతో తక్షణ చర్యలు తీసుకోవాలని హర్భజన్ సింగ్ కోరారు.


అయితే దీనిపై మంత్రి బల్జిత్ కౌర్ తీవ్రంగా స్పందించారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన వీడియోను పంజాబ్ ఘటనగా ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా,వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఏ మాదకద్రవ్యాన్ని తీసుకున్నారనే విషయంపై ఇప్పటివరకు స్వతంత్రంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. దీంతో అసలు ఘటనకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలియకముందే వీడియోను పంజాబ్ డ్రగ్స్ సమస్యతో ముడిపెట్టడంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.


మరోవైపు, రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో ఓ సాధారణ వీడియోగా ప్రారంభమైన ఈ వ్యవహారం.. పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యపై ఆప్, బీజేపీ మధ్య మరో రాజకీయ పోరుకు దారితీసింది. ఇదిలావుంటే, పంజాబ్‌లో జాంబీ డ్రగ్‌ దుమారంపై ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. పీఎంవో ఆదేశాలతోనే ఇలా చేశారంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ఈ తప్పుడు పోస్టును చాలా మంది వ్యాప్తి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

యూపీఐ లావాదేవీలపై చార్జీలు ఉండవు

ఝార్ఖండ్‌లో విద్యార్థుల నిరసన.. అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

Updated Date - Aug 11 , 2026 | 11:37 AM