Share News

యూపీఐ లావాదేవీలపై చార్జీలు ఉండవు

ABN , Publish Date - Aug 11 , 2026 | 05:17 AM

రూపే, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)ల ద్వారా జరిపే లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తారన్న అనుమానాలపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌..

యూపీఐ లావాదేవీలపై చార్జీలు ఉండవు

  • చిన్నవ్యాపారులపై భారం పడదు: నిర్మల

న్యూఢిల్లీ, ఆగస్టు 10: రూపే, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)ల ద్వారా జరిపే లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తారన్న అనుమానాలపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం రాజ్యసభలో స్పష్టత ఇచ్చారు. వీటిని ఉపయోగించే వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరని పేర్కొన్నారు. కొన్ని రకాల లావాదేవీలకు మాత్రర భవిష్యత్తులో మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) వసూలు చేసే అవకాశం ఉందని తెలిపారు. దీనిని ఇంకా ఖరారు చేయలేదని, తరువాత నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పారు. పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ఛార్జీలు వసూలు చేసేందుకు వీలు కలిగేంచేలా చట్టాన్ని సవరించామే తప్ప, వినియోగదారుల నుంచి ఇప్పటికిప్పుడు వసూలు చేయడానికి కాదని చెప్పారు. ఏ వస్తువుపై ఎండీఆర్‌ వసూలు చేయాలి, ఎంత ధరకు పరిమితం చేయాలన్న దాన్ని తరువాత నిర్ణయిస్తామని తెలిపారు. యూపీఐ విధానాన్ని 2016లో ప్రారంభించగా, అప్పటి నుంచి ఉచితంగా సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. అది కొనసాగుతుందని తెలిపారు. చిరు వ్యాపారులపై భారం పడబోదన్నారు. ఈ సందర్భంగా సీపీఎం సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడుతూ అమెరికా ఒత్తిడి మేరకే యూపీఐ చెల్లింపులపై రుసుములు వసూలు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు. దీనిపై మంత్రి చెప్పే సమాధానం వినకుండానే ఆయన వాకౌట్‌ చేశారు. ఆమె స్పందిస్తూ ‘కమ్యూనిస్టులే అంత... వాస్తవాలు చెప్పరు. ఆపై వక్రీకరణలు’ అని వ్యాఖ్యానించారు. సమాధానం వినే ధైర్యం లేని పిరికిపందలని విమర్శించారు. సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. పరిశీలన నిమిత్తం లోక్‌సభకు పంపించింది.

ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 11 , 2026 | 05:17 AM