ఝార్ఖండ్ చట్టసభ దిక్కులు పిక్కటిల్లేలా..
ABN , Publish Date - Aug 11 , 2026 | 05:02 AM
ఝార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం రాంచిలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది...
పేపర్ లీకులకు నిరసనగా విధానసభను ముట్టడించిన యువత
భవనం సమీపంలోకి చొచ్చుకెళ్లిన నిరుద్యోగులు.. ఉద్రిక్తం
నిరసనకారులపై లాఠీలు, టియర్ గ్యాస్.. తీవ్ర గాయాలు
జేఎ్‌సఎ్‌ససీ-సీజీఎల్ పరీక్ష రద్దుకు నిరుద్యోగుల డిమాండ్
మహతో మద్దతు.. సీబీఐ దర్యాప్తునకు మరాండీ డిమాండ్
జ్యుడిషియల్ విచారణకు సిద్ధమన్న ఝార్ఖండ్ సర్కారు
జేపీఎ్‌ససీ మాజీ ఛైర్మన్ ఖియంగ్తే అరెస్ట్
రాంచి, ఆగస్ట్ 10: ఝార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం రాంచిలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు 1,500 మందికి పైగా పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించి, ఎక్కడికక్కడే బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినా సరే వేలాది మంది నిరసనకారులు బారీకేడ్లను తోసుకుంటూ విధానసభ సమీపానికి చొచ్చుకుపోయారు. దీంతో నిరసనకారులపై పోలీసులు నీరుచిమ్మి (వాటర్ క్యానన్లు), భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. జగన్నాథ్‌పూర్ ఆలయం సమీపంలోని చివరి వరుస బ్యారీకేడ్ల వద్దకు (అసెంబ్లీ భవనానికి 200 మీటర్ల దూరం) చేరుకోగానే నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ సందర్భంగా పదుల సంఖ్యలో నిరసనకారులకు గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై పోలీసులు ఇష్టారీతిన లాఠీ చార్జ్ చేసినట్టు, చాలా మంది గాయపడినట్టు నిరసన కారులు ఆరోపించారు. పోలీసులు నీరు చిమ్ముతుంటే నృత్యం చేస్తూ నిరసన తెలియజేయడం కనిపించింది. ‘జేఎ్‌సఎ్‌ససీ-సీజీఎల్ పరీక్షలను రద్దు చేయాలి. లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలి’అన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మరోవైపు ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలను వ్యతిరేకిస్తూ అభ్యర్థులు చేపట్టిన నిరసన 17వ రోజుకు చేరుకుంది. తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఝార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జే ఎల్‌కేఎమ్) నేత దేవేంద్ర నాథ్ మహతో, ఏకంగా అంబులెన్స్‌లో వచ్చి మరీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మద్దతు పలికారు. విద్యార్థులపై పోలీసుల చర్యలను తప్పుబట్టారు. నిష్పాక్షిక విచారణతో నిజాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా చూసేందుకు 500 మంది కార్యకర్తలను మోహరించినట్టు ఈ నిరసనకు నేతృత్వం వహిస్తున్న ‘జేపీఎ్‌ససీ-జేఎ్‌సఎ్‌ససీ సంస్కరణల మంచ్’ తెలిపింది. విద్యార్థుల ఆందోళలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, జేపీఎ్‌ససీ-ఎ్‌సఎ్‌సఎ్‌ససీ పరీక్షలో అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి దీపికా పాండే సింగ్ స్పందిస్తూ.. విద్యార్థుల అన్ని డిమాండ్లకు ప్రభుత్వం తన పరిధిలో అంగీకారం తెలిపిందన్నారు. న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్నందున జేఎ్‌సఎ్‌ససీ-సీజీఎల్ పరీక్షలను ఏకపక్షంగా రద్దు చేయలేమని.. కావాలంటేౖ రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించారు.
సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ అరెస్ట్
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎ్‌ససీ) మాజీ ఛైర్మన్ ఎల్. ఖియంగ్తేను సీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జేపీఎ్‌ససీ 14వ సివిల్ సర్వీసెస్ పరీక్షలో అవకతవకలపై సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తోంది. నిషేధిత సంస్థ టీఎ్‌సఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేటు లిమిటెడ్ (టీడీపీఎల్)కు పరీక్ష నిర్వహణ కాంట్రాక్టును అప్పగించారని, ఇందుకు రూ.2కోట్ల లంచంతోపాటు 20 శాతం కమీషన్ కూడా తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఖియంగ్తే, జేపీఎ్‌ససీ ఛైర్మన్ పదవికి జూలై 22నే రాజీనామా చేశారు. పారదర్శకమైన దర్యాప్తునకు వీలుగానే తాను రాజీనామా చేసినట్టు వివరణ కూడా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్