లద్దాఖ్ తిరిగి జమ్మూకశ్మీర్‌లో విలీనం కావొచ్చు: ఫారూక్ అబ్దుల్లా
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:43 PM
లద్దాక్ ఏర్పాటుపై ప్రజలు ఇప్పుడు చాలా అసంతృప్తితో ఉన్నారని, జమ్మూకశ్మీర్‌లో తిరిగి కలవాలని కోరుకుంటున్నవారు అంతకంతకూ పెరుగుతున్నారని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.
శ్రీనగర్: భవిష్యత్తులో ఏదో ఒక రోజు లద్దాఖ్ (Ladakh) తిరిగి జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో కలుస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా (Farooq Abdullah) చెప్పారు. 2019లో తీసుకున్న నిర్ణయానికి లద్దాఖ్ ప్రజలు ప్రస్తుతం పశ్చాత్తాప పడుతున్నారని తెలిపారు.
జమ్మూలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్ ఏర్పాటుపై ఇప్పుడు ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని, జమ్మూకశ్మీర్‌లో తిరిగి కలవాలని కోరుకుంటున్నవారు అంతకంతకూ పెరుగుతున్నారని చెప్పారు. జమ్మూకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలంటూ వినిపిస్తున్న డిమాండ్లపై మాట్లాడుతూ, దూరదృష్టి లోపించడం, వాస్తవ పరిస్థితులపై అవగాహన లోపించడమే ఇలాంటి డిమాండ్లకు కారణమని అన్నారు. రాజకీయ కారణాలతో ప్రాంతాలను విడగొట్టటం జమ్మూకశ్మీర్ సమగ్రతను బలహీనపరచడమే అవుతుందని అన్నారు.
కొత్త జిల్లాలు అక్కర్లేదు..
చీనాబ్ వ్యాలీ, పీర్ పంజాల్ మరిన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ చేస్తున్న డిమాండ్‌ను ఫారూక్ అబ్దుల్లా తోసిపుచ్చారు. ఇప్పటికే తగినన్ని జిల్లాలు ఉన్నాయని అన్నారు. ప్రాంతాలను విడిగొట్టే డిక్సెన్ ప్లాన్‌ను పునరుద్ధరించాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. నిరుద్యోగితపై మెహబూబా ముఫ్తీ చేస్తున్న ఆరోపణలపై కూడా ఆయన మండిపడ్డారు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు.
పొరుగుదేశం పాక్‌తో సంబంధాలపై మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని సమస్యలన్నింటికీ పొరుగుదేశమే కారణమనే 'పాక్ ఫోబియా' ఉందని, అయితే పొరుగు దేశాలను మార్చలేమని గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పేవారని గుర్తుచేశారు. గాజా శాంతి ప్లాన్‌కు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు ఆహ్వానించడంపై ప్రశ్నించినప్పుడు, ట్రంప్‌తో ఇండియాకు మంచి సంబంధాలున్నాయని ఆయన జవాబిచ్చారు. ఇందువల్ల అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుతున్న ఉద్రిక్తతలను తగ్గించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి.
టెకీ మృతి ఘటన.. నొయిడా సొసైటీ బిల్డర్ అరెస్టు
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
Read Latest National News