59 ఏళ్ల నిరీక్షణకు తెర.. తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్
ABN , Publish Date - May 20 , 2026 | 08:54 PM
దాదాపు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు మంత్రివర్గంలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం గురువారంనాడు మంత్రివర్గ విస్తరణ సిద్ధమవుతోంది.
చెన్నై: దాదాపు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు మంత్రివర్గంలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం గురువారంనాడు మంత్రివర్గ విస్తరణ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి.విశ్వనాథన్‌లు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలియజేశారు.

'ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదంతో పార్టీ ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార్, పి.విశ్వనాథ్‌లు విజయ్ సారథ్యంలోని తమిళనాడు క్యాబినెట్‌లో మంత్రులుగా రేపు (గురువారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇది మాకు ఒక చారిత్రక సందర్భం. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు క్యాబినెట్‌లో చేరుతోంది. ప్రభుత్వంలో చేరుతున్న మా ఎమ్మెల్యేలు ఇద్దరికీ అభినందనలు. తమిళనాడు ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చి, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ నిర్దేశించిన సంక్షేమ, ప్రజానుకూల ప్రభుత్వ విజన్‌ను సాకారం చేస్తారని ఆశిస్తున్నాం' అని ఆ పోస్టులో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
డీఎంకేకు దూరమై.. టీవీకేతో జతకట్టి
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలకు జూనియర్ భాగస్వామిగా ఉంటూ వచ్చింది. సుదీర్ఘ కాలంగా డీఎంకేతో పొత్తు సాగించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుండా పరోక్షంగా మద్దతు కొనసాగస్తూ వచ్చింది. ఇటీవల ఎన్నికల అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకే పార్టీతో పొత్తుకు ఉద్వాసన చెప్పి విజయ్ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ పార్టీతో జతకట్టింది.
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 118 స్థానాల్లో గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు 10 సీట్లు తగ్గడంతో పొత్తులకు తెరతీసింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఐయూఎంల్, వీసీకేలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో విజయ్ ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది క్యాబినెట్‌లో చేరారు.
ఇవి కూడా చదవండి..
అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవు... సీపీఎం వార్నింగ్‌పై టీవీకే
మోసపూరితం.. టెట్రా ప్యాక్‌లో వోడ్కాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు