మోసపూరితం.. టెట్రా ప్యాక్‌లో వోడ్కాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ABN , Publish Date - May 20 , 2026 | 07:22 PM
చిన్న పిల్లలు తాగే ఫ్రూట్ జ్యూస్‌లు, మిల్క్ షేక్‌ల తరహాలో టెట్రా ప్యాక్‌లు, సాచెట్లలో వోడ్కా లిక్కర్‌ను విక్రయించడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. ఇది వినియోగదారులను, అభం శుభం తెలియని చిన్నారులను తప్పుదారి పట్టించడమే అవుతుందని పేర్కొంది.
న్యూఢిల్లీ: చిన్న పిల్లలు తాగే ఫ్రూట్ జ్యూస్‌లు, మిల్క్ షేక్‌ల తరహాలో టెట్రా ప్యాక్‌లు, సాచెట్లలో వోడ్కా లిక్కర్‌ను విక్రయించడంపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. ఇది వినియోగదారులను, అభం శుభం తెలియని చిన్నారులను తప్పుదారి పట్టించడమే అవుతుందని పేర్కొంది. ఇది 'మోసపూరితం' అని పేర్కొంటూ దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, పలు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది విపిన్ నాయిర్ తన వాదన వినిపిస్తూ, ఇలాంటి చాలా ఆల్కహాల్ ఉత్పత్తులపై హెచ్చరికలు ఉండటం లేదన్నారు. పొగాకు తరహాలో వార్నింగ్ హెచ్చరికలు లేకపోవడం వల్ల ఇవి పండ్ల రసాల్లా కనిపిస్తాయని, కానీ అందులో ఉండేది మాత్రం వోడ్కా అని చెప్పారు. టెట్రా ప్యాకింగ్ సాధారణంగా చిన్నపిల్లలు తాగే పండ్లరసాలు, పాల ఉత్పత్తులకు వాడతారని, ఫ్రూట్ జ్యూస్‌లను పోలినట్టు ఉండటంతో చిన్నారులు జ్యూస్ అనుకుని తాగే ప్రమాదం ఉందని అన్నారు. ఇలాంటి ప్యాకేజ్‌ల్లో మధ్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ యూనిఫాం పాలసీ రూపొందించేలా కేంద్రానికి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలివ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని విపిన్ నాయర్ కోరారు.
మద్యం వ్యాపారులు ఖర్చు తగ్గించుకోవడానికి, రవాణా సులువుగా ఉండేందుకు గ్లాస్ బాటిళ్లకు బదులుగా టెట్రా ప్యాక్‌లు వాడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి ప్యాక్‌లతో వోడ్కా అమ్మకాలు జరపడం మద్యం వినియోగాన్ని, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ప్రోత్సహించడమే అవుతుందని, రాష్ట్రాల సరిహద్దుల వెంబడి స్మగ్లింగ్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఉత్పత్తులను మార్కెట్ చేయడం, డిజైన్ చేసే విధానం వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉందని వాదించారు. ఇరువైపు వాదనల విన్న కోర్టు ఇలాటి మోసపూరిత విక్రయాలు ప్రజారోగ్యానికి ముప్పని భావిస్తూ కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలు పెరుగుతుండటంపై 2025 నవంబర్‌లో సుప్రీంకోర్టు విమర్శలు చేసింది. వీటి ప్యాకేజీ ఫ్రూట్ జ్యూస్ కార్టన్లను పోలి ఉందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కులగణనపై సీజేఐ ధర్మాసనం కీలక తీర్పు
వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా