వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా?
ABN , Publish Date - May 20 , 2026 | 02:57 AM
వీధికుక్కల వల్ల సామాన్య ప్రజలకు గాయాలైనా, హాని లేదా నష్టం జరిగితే.. దానికి సంబంధించిన న్యాయపరమైన బాధ్యతను తీసుకునేందుకు జంతుప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, ఎన్జీవోలు సిద్ధమేనా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
వీధికుక్కలను షెల్టర్లకు తరలించడంపై మేం గతంలో ఇచ్చిన తీర్పును మార్చబోం
సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టీకరణ
రేబిస్ సోకిన, ప్రమాదకరంగా మారిన శునకాల కారుణ్యమరణానికి అనుమతి
న్యూఢిల్లీ, మే 19: వీధికుక్కల వల్ల సామాన్య ప్రజలకు గాయాలైనా, హాని లేదా నష్టం జరిగితే.. దానికి సంబంధించిన న్యాయపరమైన బాధ్యతను తీసుకునేందుకు జంతుప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, ఎన్జీవోలు సిద్ధమేనా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండే వీధి కుక్కలను రక్షించే హక్కు తమకుందని ఎవరైనా వాదిస్తే.. తమ చర్యల వల్ల ఇతరులకు ఎలాంటి హానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత నుంచి వారు వేరుపడలేరని స్పష్టం చేసింది. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండే వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ.. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం మంగళవారం 131 పేజీల తీర్పునిచ్చింది. వీధి కుక్కల భయం లేకుండా స్వేచ్ఛగా తిరగగలగడం అనేది ప్రజలు గౌరవంగా జీవించే హక్కు కిందికి వస్తుందని అందులో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు, వృద్ధులు అంతర్జాతీయ పర్యాటకులు కుక్కకాటుకు గురవుతున్నారని.. కఠినమైన ఈ క్షేత్రస్థాయి వాస్తవాలను తాము విస్మరించలేమని పేర్కొంది. వీధి కుక్కల బెడదను నివారించేందుకు వాటిని జనసమ్మర్థ ప్రదేశాల నుంచి షెల్టర్లకు తరలించాలంటూ సుప్రీంకోర్టు గత ఏడాది నవంబరు 7న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. వీధికుక్కలను జనసమ్మర్థ ప్రదేశాల నుంచి తరలించి, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ (సంతానోత్పత్తి నియంత్రణ ఆపరేషన్లు) చేసి.. మళ్లీ వాటిని తెచ్చిన చోటే వదిలేయాలంటూ అంతకుముందు ఆగస్టులో ఇచ్చిన తీర్పును కూడా సుప్రీం ధర్మాసనం (తన నవంబరు 7నాటి తీర్పులో) సవరించుకుంది. వాటిని తెచ్చిన చోటే తిరిగి వదిలేయకుండా షెల్టర్లకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. ఆ తీర్పును ఉపసంహరించుకోవాలంటూ పలువురు జంతుప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం జనవరి 29న తీర్పును వాయిదా వేసింది.
మంగళవారం.. ఆ పిటిషన్లను తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా అదుపు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సరిగ్గా ప్రయత్నించట్లేదని అభిప్రాయపడింది. వాటి నియంత్రణకు, ప్రజల భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక పూర్తిస్థాయి కార్యాచరణ కలిగిన యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఆ కేంద్రంలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, శస్త్రచికిత్స సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు అన్నీ ఉండాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అమలుపరచకపోతే.. తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. అలాగే, రేబిస్ బారిన పడిన, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే, నయం చేయడానికి వీలుకానంతగా జబ్బుపడ్డ వీధి కుక్కల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారి ఆమోదం తెలిపింది. వీధి కుక్కల జనాభా ఆందోళనకరస్థాయికి చేరుకున్న చోట్ల.. కుక్క కాటు ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో, ప్రమాదకరమైన కుక్కలను అధికారులు కారుణ్య మరణాలకు గురిచేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పశువైద్య నిపుణుల నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే.. అది కూడా, జంతు హింస నిరోధక చట్టం 1960, యానిమల్ బర్త్ కంట్రోల్‌రూఊల్స్ 2023, ఇతరత్రా చట్టబద్ధమైన నిబంధనలకు కచ్చితంగా లోబడి మాత్రమే కారుణ్య మరణానికి గురిచేయవచ్చని వివరించింది.
నల్సార్ వర్సిటీ గురించి ప్రస్తావన
తమ క్యాంప్‌సలో ‘యానిమల్ లా సెంటర్’ను ఏర్పాటు చేయడం ద్వారా వర్సిటీప్రాంగణంలోని కుక్కల పట్ల దయతో వ్యవహరించేలా విద్యార్థులు, సిబ్బంది అందరికీ అవగాహన కల్పిస్తున్నామని, ఇలాంటి సామాజిక ప్రయోగాలను ఇతర విద్యాసంస్థల్లో కూడా చేపట్టవచ్చని నల్సార్ వర్సిటీ చేసిన వాదనను సుప్రీం కోర్టు తన తీర్పులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. విశ్వవిద్యాలయ ప్రాంగణం పరిధిలో ఎవరైనా కుక్కకాటుకు గురైతే బాధితులకు జరిగిన నష్టానికి, హానికి సంబంధించి తామే పూర్తి చట్టపరమైన బాధ్యత తీసుకుంటామని వర్సిటీల్లోని జంతు సంరక్షణ బృందాలు వీసీలకు హామీ పత్రాన్ని సమర్పించాలని తేల్చి చెప్పింది. అలా చేయకపోతే సదరు సంస్థ ప్రాంగణంలో వీధికుక్కలను సాకడం, వాటికి ఆహారం అందించడం వంటి కార్యకలాపాలను ఆ సంస్థ అధిపతి అనుమతించకూడదని ఆదేశించింది. ఈ ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే సదరు అధిపతిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రుల వంటి సంస్థాగత ప్రదేశాలకు వాటి స్వభావం రీత్యా అత్యున్నతస్థాయి భద్రతాప్రమాణాలు అవసరమని.. అటువంటి భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశం ఉన్న ఎటువంటి చర్యకైనా బాధ్యతను స్వీకరించేవారు ఉండాలని తేల్చిచెప్పింది.