Share News

దేవాదాయ చట్టాల చెల్లుబాటుపై మేమే విచారిస్తాం

ABN , Publish Date - May 20 , 2026 | 02:54 AM

హిందూ దేవాలయాలు, మతపరమైన దేవాదాయ సంస్థల నియంత్రణ చట్టాల రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

దేవాదాయ చట్టాల చెల్లుబాటుపై మేమే విచారిస్తాం

  • రివ్యూ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాలు, మతపరమైన దేవాదాయ సంస్థల నియంత్రణ చట్టాల రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు తీసుకొచ్చిన దేవాదాయ చట్టాల్లోని నిబంధనలపై మెరిట్స్‌ ఆధారంగా తామే విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించాలంటూ 2025ఏప్రిల్‌లో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. గత ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మల ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాల నిర్వహణలో జోక్యం చేసుకునేలా తీసుకొచ్చిన చట్టాలను (ఏపీ-1987, తెలంగాణ-1987, తమిళనాడు-1959, పుదుచ్చేరి-1972) సవాల్‌ చేస్తూ 2012లో సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే, ఒక్కో రాష్ట్ర చట్టం ఒక్కో రకంగా ఉండే అవకాశం ఉన్నందున హైకోర్టులే వీటిని విచారించడం మంచిదని 2025లో సుప్రీంకోర్టు పేర్కొంది. నాటి ఆదేశాలపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా పిటిషనర్లు బలమైన వాదనలు వినిపించారు. దక్షిణాది రాష్ట్రాల దేవాదాయ చట్టాలు వేర్వేరుగా ఉన్నాయన్న కోర్టు అంచనా సరికాదన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర దేవాదాయ చట్టాల ఆధారంగానే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి చట్టాలు రూపొందాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కార్యనిర్వాహక అధికారు (ఈవో)ల నియామకం, కమిషనర్ల అధికారాలు, ఆలయ నిధుల మళ్లింపు, ఫీజుల వసూలు వంటి కీలక నిబంధనలన్నీ ఈ నాలుగు చట్టాల్లోనూ ఒకేలా ఉన్నాయని వివరించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి దేవాదాయ చట్టాల్లోని పలు నిబంధనలు రాజ్యాంగంలోని పలు అధికరణలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. గతంలో ‘షిరూర్‌ మఠం’ కేసులో మద్రాస్‌ దేవాదాయ చట్టంలోని పలు నిబంధనలను న్యాయస్థానం కొట్టివేసినప్పటికీ, ప్రభుత్వాలు వాటినే మళ్లీ కొత్త చట్టాల్లో చేర్చాయని ఆరోపించారు.

Updated Date - May 20 , 2026 | 02:54 AM