Share News

Grok Obscene Images: గ్రోక్ అసభ్య కంటెంట్ ఎఫెక్ట్.. 600 అకౌంట్లు డిలీట్..

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:25 PM

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా చట్టవిరుద్ధమైన కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ కేంద్రం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎక్స్ మాధ్యమం చర్యలు చేపట్టింది. సదరు కంటెంట్ సంబంధిత ఖాతాలను తొలగించినట్టు పేర్కొంది.

Grok Obscene Images: గ్రోక్ అసభ్య కంటెంట్ ఎఫెక్ట్.. 600 అకౌంట్లు డిలీట్..
Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'ను ఉపయోగించి కొందరు అశ్లీల కంటెంట్‌ను సృష్టించారంటూ ఇటీవల కేంద్రం ఆందోళన చెందింది. సదరు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టిన 'ఎక్స్'.. సుమారు 600 అకౌంట్లను వెంటనే డిలీట్ చేసింది. అలాగే ఆ కంటెంట్‌తో సంబంధమున్న సుమారు 3,500 పోస్టులను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌లో అశ్లీల కంటెంట్‌ను అనుమతించబోమని, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని 'ఎక్స్' హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


ఎలన్ మస్క్(Elon Musk)కు చెందిన 'ఎక్స్' సామాజిక మాధ్యమంలోని ఏఐ ప్లాట్‌ఫామ్ 'గ్రోక్(Grok)' ఆధారంగా కొందరు ఆకతాయిలు ఇటీవల అశ్లీల చిత్రాలు క్రియేట్ చేశారు. మహిళల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తీరు వివాదాస్పదమైంది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలొచ్చాయి. దీంతో సదరు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆయా సోషల్ మీడియాలకు ఆదేశాలు జారీచేసింది కేంద్రం. అలాంటి అసభ్యకర కంటెంట్‌కు సంబంధించిన ఫిర్యాదులపై ఆయా సామాజిక మాధ్యమాలే బాధ్యత వహించాలని పేర్కొంది.


ఈ నేపథ్యంలో పలు ఖాతాలపై చర్యలు చేపట్టింది ఎక్స్. గ్రోక్‌లో ఫొటోలు క్రియేట్ చేసుకునే ఫీచర్‌పై ఇప్పటికే షరతులు విధించింది. ఈ ఫీచర్‌ను ప్రీమియమ్ సబ్‌స్క్రైబ్ దారులకే వర్తించేలా పరిమితులు విధించింది.


ఇవీ చదవండి:

ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..

ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..

Updated Date - Jan 11 , 2026 | 01:25 PM