బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - May 02 , 2026 | 07:36 PM
బెంగాల్‌లో అదనపు కౌంటింగ్ పరిశీలకులు, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించింది. రెగ్యులర్ కౌంటింగ్ అబ్జర్వర్లకు సాయంగా 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను మోహరిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించింది.
న్యూఢిల్లీ: బెంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పర్యవేక్షకులుగా.. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను మాత్రమే ఎలక్షన్ కమిషన్ నియమించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన కొద్ది గంటలకే ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో అదనపు కౌంటింగ్ పరిశీలకులు, పోలీసు పరిశీలకులను నియమించింది. రెగ్యులర్ కౌంటింగ్ అబ్జర్వర్లకు సాయంగా 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను మోహరిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించింది.
రాజ్యాంగంలోని 324వ అధికరణ, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 20బి కింద అదనపు పరిశీలకుల నియామకం జరిపినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి కంటే ఎక్కువ కౌంటింగ్ హాల్స్ ఉన్నచోట రెగ్యులర్ కౌంటింగ్ పరిశీలకులకు సాయంగా అదనపు కౌటింగ్ పరిశీలకులు ఉంటారని తెలిపింది.
కాగా, పోలీసు పరిశీలకులు తమకు కేటాయించిన కౌంటింగ్ సెంటర్ల వద్ద శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షిస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అయితే, కౌంటింగ్ రోజు మాత్రం కౌంటింగ్ హాలులోకి పోలీసు పరిశీలకులను అనుమతించరు.
ఇవి కూడా చదవండి..
సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..
200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా