పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు
ABN , Publish Date - Apr 22 , 2026 | 08:00 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి 'టెర్రరిస్టు' అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 24 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఖర్గేకు నోటీసు పంపింది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి 'టెర్రరిస్టు' అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 24 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఖర్గేకు నోటీసు పంపింది. ఖర్గే వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నందున ఆయనపై చర్య తీసుకోవాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా ఆదేశించాలని బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈసీకి బుధవారం ఉదయం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఖర్గే వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్ నోటీసు ఇచ్చింది.
ప్రధానమంత్రిని ఉగ్రవాదిగా పేర్కొనడం యావద్దేశాన్ని అవమానించడమేనని బీజేపీ ప్రతినిధుల బృందంలోని నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 175 కింద నేరమవుతుందని, పరువునష్టం కేసు వేసేందుకు అవసరమైన ప్రాథమిక సాక్ష్యంగా ఆయన వ్యాఖ్యలు నిలుస్తాయని ఈసీ దృష్టికి తెచ్చారు.
ఖర్గే ఏమన్నారంటే..
అన్నాడీఎంకే, బీజేపీ పొత్తుపై ఖర్గే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, ఆ పార్టీ మోదీతో ఎలా చేతులు కలిపిందని ప్రశ్నించారు. ఆయనకు సమానత్వం, న్యాయంపై నమ్మకం లేవన్నారు. అలాంటి వాళ్లతో అన్నాడీఎంకే కలవడమంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని విమర్శించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించడంతో ఆయన తిరిగి వివరణ ఇచ్చారు. మోదీని తాను ఎప్పుడూ ఉగ్రవాది అని అనలేదని, ప్రజలు, రాజకీయ పార్టీలను ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. తాజాగా, ఈసీ నోటీసు ఇవ్వడంతో గురువారం సాయంత్రంలోగా ఈసీకి ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపే ప్రతినిధి బృందం ఫిర్యాదు
ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టడం సరికాదు.. మమతాబెనర్జీ చర్యను తప్పుపట్టిన సుప్రీం