Maharashtra Civic Polls: 'మహా' పోల్స్‌లో మార్కర్ పెన్‌ల వివాదం.. రాహుల్ తీవ్ర విమర్శ
ABN , Publish Date - Jan 16 , 2026 | 08:16 PM
మున్సిపల్ ఎన్నికల్లో చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్ వాడారని, ఇందువల్ల ఓటర్ల చేతికి వేసిన ముద్రను తేలిగ్గా చెరిపివేసేందుకు వీలుంటుందని, ఇది బోగస్ ఓట్లకు దారితీస్తుందని పలు విపక్ష పార్టీలు గురువారంనాడు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై రాహుల్ తొలిసారి స్పందించారు.
ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్‌లు ఉపయోగించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారంనాడు దీనిపై మరింత ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యను తప్పుపట్టారు. పౌరులను తప్పుదారి పట్టిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు.
ఈ అంశంపై విపక్షాలు లేవనెత్తిన ఆందోళనలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. 'ప్రజలను గ్యాస్‌లైటింగ్ చేస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ఓటు చోరీ దేశద్రోహ చర్య' అని రాహుల్ తప్పుపట్టారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏమంది?
మున్సిపల్ ఎన్నికల్లో చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్ వాడారని, ఇందువల్ల ఓటర్ల చేతికి వేసిన ముద్రను తేలిగ్గా చెరిపివేసేందుకు వీలుంటుందని, ఇది బోగస్ ఓట్లకు దారితీస్తుందని పలు విపక్ష పార్టీలు గురువారంనాడు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. మార్కర్ పెన్‌లలో వినియోగించిన చెరగని సిరా నాణ్యతపై విచారణ జరుపుతామని తెలిపింది. 'ఇంకును ఓటింగ్ సమయంలో వేలిపై వేశారా, లేక ఇది ఆకతాయిల చర్యా అనేది తెలుసుకునేందుకు వీడియోలను పరిశీలిస్తాం' అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వాఘ్‌మారే చెప్పారు. వివాదం నేపథ్యంలో రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మార్కర్ పెన్‌లను వాడేది లేదని, తిరిగి చెరగని సిరాను మాత్రమే వాడతామని చెప్పారు.
బీజేపీ స్పందన
కాగా, ప్రజలను గ్యాస్‌లైటింగ్ చేస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందనీ, ఓటు చోరీ దేశద్రోహ చర్య అనీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే ఆయన సాకులు వెతుక్కుంటున్నారని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన.. నితిన్ నబీన్ ఎన్నికకు మార్గం సుగమం
జస్టిస్ యశ్వంత్ వర్మకు దక్కని ఊరట.. విచారణకు తొలగిన అడ్డంకి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి